అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌తో తెలంగాణకు నిధుల వరద!
భారతీయ సమాఖ్య వ్యవస్థలో నిధుల కేటాయింపులు ఎప్పుడూ ఒక రాజకీయ రణరంగమే. ఒకవైపు ‘రూపాయి తీసుకుని పావలా కూడా ఇవ్వడం లేదంటూ’ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నాలుగో నేషనల్ ఎపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణకు ఊహించని రీతిలో భారీ నిధులు దక్కాయి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రాష్ట్రంలో రూ.3,892 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు మెగా ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం ఇస్తున్న ఈ రూ.873.49 కోట్ల ఆర్థిక సాయం కేవలం అభివృద్ధి కోణంలోనే కాకుండా, రాబోయే రోజుల్లో రాజకీయ మైలేజీ కోసం అధికార, ప్రతిపక్షాల మధ్య సరికొత్త చర్చకు తెరలేపింది.
ఇప్పటివరకు యూసీఎఫ్ కింద తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టుల విలువ ఏకంగా రూ.9,573 కోట్లకు చేరుకుంది. నిధుల సమీకరణ విధానాన్ని పరిశీలిస్తే.. కేంద్రం 20 నుంచి 25 శాతం మేర గ్రాంట్లు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తోంది. మిగిలిన నిధులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడల్ ద్వారా రాబడుతున్నారు. ఈ ఆర్థిక సర్దుబాటు ప్రభుత్వంపై భారాన్ని తగ్గించినప్పటికీ, ఈ క్రెడిట్ ఎవరికి చెందాలనే దానిపై మాత్రం ఎప్పటిలాగే మాటల యుద్ధం మొదలైంది. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతులు రూపుదిద్దుకుంటున్నాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ చొరవ, వాటా లేకపోతే ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేవి కాదనే వాదన ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
తాజా జాబితాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి గోదావరి తాగునీటి సరఫరా పథకం కోసం రూ.1,992 కోట్లు కేటాయించడం అత్యంత కీలకం. ఘన్పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరకు 120 కిలోమీటర్ల పైప్లైన్లు, రెండు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ద్వారా 2035 నాటికి దాదాపు 1.74 కోట్ల మంది తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఇటీవల ఓఆర్ఆర్ పరిధిలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలకు ఈ ఫలాలు అందనుండటం రాజకీయంగా కీలకం.
అలాగే, రాజకీయంగా ఎప్పుడూ ప్రాధాన్యత ఉండే వరంగల్ నగరానికి ఈ విడతలో పెద్దపీట వేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సమగ్ర వరదనీటి నిర్వహణ వ్యవస్థ కోసం రూ.1,465 కోట్లు మంజూరయ్యాయి. వర్షాకాలంలో మునిగిపోయే లోతట్టు ప్రాంతాలు, 24 క్రానిక్ ఫ్లడ్ పాయింట్ల సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘స్పాంజ్ సిటీ కాన్సెప్ట్’ను తెరపైకి తెచ్చారు. దీనికి తోడు చారిత్రక వరంగల్ కోట కందకం పునరుద్ధరణకు రూ.209.08 కోట్లు, హనుమకొండ సెంట్రల్ బస్ డిపో నిర్మాణానికి రూ.168.80 కోట్లు కేటాయించడం ద్వారా స్థానిక సెంటిమెంట్‌ను, పర్యాటక అభివృద్ధిని ముడిపెట్టే ప్రయత్నం జరిగింది. ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదోదైన జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఆలయ అభివృద్ధికి రూ.57.50 కోట్లు కేటాయించడం కూడా భక్తులు, స్థానిక ప్రజలను ఆకట్టుకునే వ్యూహాత్మక చర్యగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే గత మే నెలలో జరిగిన తొలి సమావేశంలో వరంగల్ భూగర్భ డ్రైనేజీకి రూ.4,674 కోట్లు, కరీంనగర్ పార్కులు- చెరువుల అభివృద్ధికి రూ.840 కోట్లు, ఖమ్మం ఏఐ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి రూ.160 కోట్లు ఆమోదం పొందాయి. కేంద్రం నుంచి నిధులు వస్తున్న మాట వాస్తవమే అయినా, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా అంతే కీలకం. ఏది ఏమైనప్పటికీ, కేంద్ర-రాష్ట్రాల మధ్య నిత్యం నడిచే రాజకీయ ఆరోపణల యుద్ధం మధ్యలో, ఈ నిధులు మాత్రం తెలంగాణ పట్టణ రూపురేఖలను సమూలంగా మార్చేయడానికి దోహదపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.







