అమెరికా ఎన్నికల్లో దుమ్ము రేపిన డాక్టర్లు ! వీళ్ల అసలు టార్గెట్ ఎవరు?!
అమెరికా రాజకీయాల్లో ఇన్నాళ్లూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదుల హవా చూశాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. స్టెతస్కోప్ పట్టిన చేతులే చట్టాలు చేసే స్థాయికి చేరుకున్నాయి. ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం చేసిన డాక్టర్లు ఇప్పుడు ఏకంగా అమెరికా రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు సాధించిన విజయాలు అమెరికాలో కొత్త చర్చకు తెరతీశాయి.
ఆరుగురు వైద్య, ప్రజారోగ్య రంగ నిపుణులు ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లోకి వస్తుండటంతో ట్రంప్ ప్రభుత్వ ఆరోగ్య విధానాలపై ప్రశ్నలు మరింత గట్టిగా వినిపించబోతున్నాయి. అందులోనూ ఆరోగ్య శాఖ కార్యదర్శి RFK జూనియర్‌ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు మొదలవడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అసలు డాక్టర్లు రాజకీయాల్లోకి రావడానికి కారణమేంటి? వారి విజయంతో అమెరికా ఆరోగ్య వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
ఆసుపత్రుల నుంచి అమెరికా కాంగ్రెస్ వరకు.. డాక్టర్ల కొత్త ప్రయాణం!
ఈ ఎన్నికల్లో వైద్య నేపథ్యం ఉన్న అభ్యర్థులు సాధించిన విజయాలు యాదృచ్ఛికంగా జరిగినవి కావు. అమెరికాలో పెరుగుతున్న వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా సమస్యలు, ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్ణయాలు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో వైద్య రంగంలో ప్రత్యక్ష అనుభవం ఉన్నవారిని రాజకీయాల్లోకి తీసుకురావడంపై డెమోక్రాట్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలకు చెందిన నిపుణులను ప్రోత్సహించే 3.14 Action Fund కూడా ఈ అభ్యర్థులకు మద్దతుగా నిలిచింది. ఈ ప్రయత్నంలో ఆరుగురు వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు విజయం సాధించడం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.
ఈ విజయాలపై 3.14 Action అధ్యక్షురాలు షానెస్సీ నాటన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత డెమోక్రటిక్ వైద్యులు మళ్లీ సెనేట్‌లోకి వస్తున్నారని ఆమె గుర్తుచేశారు. గతంలో డెమోక్రటిక్ వైద్యుడు సెనేట్‌లో ఉన్న సమయంలోనే Medicare, Medicaid పథకాలకు కాంగ్రెస్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ వైద్య నిపుణులను వాషింగ్టన్కు పంపించడం వెనుక ప్రజల ఆకాంక్ష ఉందని, అందరికీ అందుబాటు ధరల్లో వైద్యం అందించేందుకు వీరు పోరాడతారని ఆమె అభిప్రాయపడ్డారు.
కోవిడ్ సమయంలో కనిపించిన డాక్టర్.. ఇప్పుడు ఏకంగా గవర్నర్!
ఈ ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాక్టర్ అమీ ఆక్టన్. కోవిడ్ మహమ్మారి సమయంలో ఒహియో ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమెకు ప్రజారోగ్య నిర్వహణలో మంచి అనుభవం ఉంది. ఆ సమయంలో మహమ్మారిని ఎదుర్కోవడం, ప్రజలకు ఆరోగ్యపరమైన సూచనలు అందించడం వంటి బాధ్యతల్లో ఆమె కీలకంగా వ్యవహరించారు.
ఇప్పుడు అదే ఒహియో రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అంటే ఒకప్పుడు ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి వైద్యపరమైన సలహాలు ఇచ్చిన ఆమె.. ఇప్పుడు రాష్ట్ర పాలనలోనే కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారు.
మిషిగన్ నుంచి సెనేటర్‌గా ఎన్నికైన డాక్టర్ అబ్దుల్ ఎల్-సయీద్ కథ కూడా ఇలాంటిదే. ఆయనకు వైద్య రంగంతో పాటు ప్రజారోగ్య పరిపాలనలోనూ అనుభవం ఉంది. 2023 మార్చి నుంచి 2025 ఏప్రిల్ వరకు వేన్ కౌంటీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌గా, కౌంటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ప్రజారోగ్య సమస్యలు క్షేత్రస్థాయిలో ఎలా ఉంటాయి? ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే విషయాలపై ఆయనకు ప్రత్యక్ష అవగాహన ఉంది.
ఇక సౌత్ కరోలినాలో పీడియాట్రిషియన్ డాక్టర్ అన్నీ ఆండ్రూస్ కూడా ఎన్నికల్లో విజయం సాధించారు. డార్లీన్ గ్రాహమ్ను ఓడించి సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్ల ఖాతాలో వేశారు. పిల్లల వైద్యురాలిగా పనిచేసిన ఆమెకు ఆసుపత్రుల్లో కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలనే అంశాన్ని తన ప్రచారంలో బలంగా ప్రస్తావించారు.
డాక్టర్లు గెలిచారు సరే.. ఇప్పుడు RFK జూనియర్‌కు కష్టాలు తప్పవా?
ఈ వైద్యుల విజయాల వెనుక మరో పెద్ద రాజకీయ కథ ఉంది. అదే ట్రంప్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ (RFK Jr.) చుట్టూ మొదలైన వివాదం. ఆరోగ్య విధానాలు, వ్యాక్సిన్లపై ఆయన వైఖరి, ప్రజారోగ్య కార్యక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు ఆధిక్యం రావడంతో ఈ అంశాలపై మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Defend Public Health (DPH) అనే ప్రజారోగ్య సంస్థ అయితే ఈ విషయంలో కొత్త కాంగ్రెస్ వెంటనే రంగంలోకి దిగాలని కోరుతోంది. కెన్నెడీ వ్యవహారశైలి, ఆయన చేసిన ప్రకటనలు, ట్రంప్ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి సంబంధించిన నిధుల్లో తీసుకొచ్చిన కోతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సంస్థ ఆరోపిస్తోంది. ప్రజారోగ్య వ్యవస్థకు నష్టం జరుగుతోందని, దీనిపై కాంగ్రెస్ సమగ్ర విచారణ చేపట్టాలని DPH కోఆర్డినేటింగ్ కమిటీ సభ్యురాలు జూలీ స్కోఫీల్డ్ డిమాండ్ చేశారు.
అమెరికా ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారా?
ఇన్నాళ్లూ ఆరోగ్య విధానాలపై రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకుంటుంటే, ఇప్పుడు ఆ రంగంలో పనిచేసిన నిపుణులే నేరుగా చట్టసభల్లోకి వస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొనే ఇబ్బందులు, వైద్య ఖర్చుల భారం, ఆరోగ్య బీమా సమస్యలు, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై వీరు తమ అనుభవంతో మాట్లాడే అవకాశం ఉంది.
ముఖ్యంగా Medicare, Medicaid పథకాల భవిష్యత్తు, ప్రజారోగ్యానికి నిధులు, వ్యాక్సిన్ విధానాలు వంటి అంశాలు కొత్త కాంగ్రెస్‌లో మరింత ప్రాధాన్యం పొందవచ్చు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై డెమోక్రాట్లు విచారణకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ డిమాండ్లన్నీ అమల్లోకి రావాలంటే కాంగ్రెస్‌లో రాజకీయ మద్దతు, చట్టపరమైన ప్రక్రియలు కీలకం కానున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల






