ట్రంప్ ప్రమాణ స్వీకారంలో దిగిన ఫొటో.. ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్?
కొన్ని ఫొటోలు తీసినప్పుడు వాటి ప్రాధాన్యత వెంటనే అర్థం కాదు. కానీ కాలం గడిచేకొద్దీ అవే ఫొటోలు కొత్త కథలు చెబుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తీసిన ఓ ఫొటో ఇప్పుడు అలాంటి కొత్త సమస్యనే తెచ్చి పెడుతోంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చిన ఆ ఫొటోను ఇప్పుడు మరోసారి జనం గుర్తు చేసుకుంటున్నారు. కారణం.. అందులో కనిపించిన వ్యక్తుల చుట్టూ అమెరికా రాజకీయాలు ఊహించని మలుపు తిరగటమే. ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది… అసలు సమస్య ఏమిటి
ఆ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా?
2025 జనవరి 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తీసిన ఆ ఫొటోలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా కనిపించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, అత్యంత ప్రభావవంతమైన టెక్ సంస్థల అధిపతులు ఒకే వేదికపై కనిపించడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే AI రంగంలో నియంత్రణలు తగ్గుతాయని, భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి మరిన్ని అవకాశాలు వస్తాయని టెక్ కంపెనీలు ఆశించాయనే విశ్లేషణలు వినిపించాయి. ఆ తర్వాత AI రంగంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. టెక్ దిగ్గజాల సంపద కూడా భారీగా వృద్ధి చెందింది. కానీ ఇప్పుడు అమెరికా ఓటర్లలో ఇదే టెక్ రంగంపై అసంతృప్తి పెరిగిందని తాజా ఎలక్షన్స్ రిజల్ట్ లు ముక్కు గుద్ది మరీ చెప్పాయి.
$450 మిలియన్లు ఖర్చు చేసినా మస్క్‌కు ఎదురుదెబ్బ!
ఈ పరిణామాల్లో ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన మస్క్, రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా సుమారు 450 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు కథనం వెల్లడించింది. ముఖ్యంగా టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్కు భారీగా మద్దతు ఇచ్చారు. కానీ ఎన్నికల్లో పాక్స్టన్ ఓటమి పాలయ్యారు.
మరోవైపు డెమొక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించడంతో మస్క్ గతంలో నిర్వహించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) వ్యవహారాలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు, USAID వంటి సంస్థలపై తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు పేరుతో జరిగిన మార్పులపై విచారణ జరపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు.
అంటే ట్రంప్‌తో మస్క్‌కు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనకు రాజకీయంగా కొత్త సవాళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంది.
అసలు సమస్య AI కంపెనీలతోనే మొదలైంది!
టెక్ దిగ్గజాలకు ఎదురవుతున్న మరో పెద్ద సమస్య డేటా సెంటర్లు. AI అభివృద్ధి కోసం కంపెనీలు భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. వీటికి విపరీతమైన విద్యుత్, నీరు అవసరం. స్థానిక ప్రజలకు మాత్రం వీటి వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయనే భయం, నీటి వనరులపై ఒత్తిడి, పర్యావరణ సమస్యలపై ఆందోళన పెరుగుతోంది.
ఈ అసంతృప్తినే డెమొక్రాట్లు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మార్చుకున్నారు. టెక్సాస్, ఒహియో, జార్జియా వంటి రాష్ట్రాల్లో కొత్త భారీ డేటా సెంటర్ల నిర్మాణంపై తాత్కాలిక విరామాలు విధిస్తామని డెమొక్రటిక్ నాయకులు హామీ ఇచ్చారు.
ఇది AI కంపెనీలకు చిన్న సమస్య కాదు. ఎందుకంటే వాటి భవిష్యత్తు భారీ కంప్యూటింగ్ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంది. డేటా సెంటర్ల నిర్మాణానికి అనుమతులు ఆలస్యమైతే AI అభివృద్ధి ప్రణాళికలపైనా ప్రభావం పడుతుంది.
Nvidia, Amazonలకు కూడా విచారణల సెగ!
డెమొక్రాట్లు కాంగ్రెస్‌లో పట్టు సాధించడంతో టెక్ కంపెనీలపై విచారణలకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే Nvidia, Amazon వంటి సంస్థలకు భవిష్యత్తులో జరిగే విచారణలకు అవసరమైన రికార్డులను భద్రపరచాలని లేఖలు పంపినట్లు కథనం వెల్లడించింది.
మసాచుసెట్స్ సెనేటర్ ఎడ్ మార్కీ చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో ఆసక్తికరంగా ఉన్నాయి. టెక్ కంపెనీలపై విచారణల కోసం సబ్‌పోనాలు ముద్రించడానికి కొత్త అడవులే నాటాల్సి వస్తాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు, సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు ఒకవైపు AI వల్ల మానవాళికి ప్రమాదాలు ఉండొచ్చని హెచ్చరిస్తూనే, మరోవైపు తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. జార్జియా సెనేటర్ జోన్ ఒసాఫ్ కూడా తన విజయ ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
ఆ ఫొటో ఇప్పుడు మరో అర్థాన్ని చెబుతోందా?
ట్రంప్ ప్రమాణ స్వీకారం సమయంలో తీసిన ఆ ఫొటో అప్పట్లో అమెరికా రాజకీయాలు, టెక్నాలజీ రంగం మధ్య ఏర్పడిన సాన్నిహిత్యానికి గుర్తుగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే ఫొటోను చూస్తే మరో ప్రశ్న ఎదురవుతోంది. రాజకీయ అధికారానికి దగ్గరగా ఉండటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనాలు కలగొచ్చు. కానీ ఆ సంబంధాలపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుంది?
అలాగే ఒకప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా ఉండటం టెక్ కంపెనీలకు వ్యాపార అవకాశంగా కనిపించింది. కానీ ఇప్పుడు AI నియంత్రణలు, డేటా సెంటర్ల నిర్మాణం, బిలియనీర్ల రాజకీయ జోక్యం వంటి అంశాలు అమెరికా ఎన్నికల్లో కీలక చర్చగా మారాయి. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డెమొక్రాట్లు రాజకీయ అజెండాగా మార్చుకున్నారు. దాంతో సీన్ రివర్స్ అయ్యింది. ఎప్పుడు ఎవరకి సమస్య వచ్చి పడుతుందో అనే టెన్షన్స్ టెక్ బిలియనీర్లు కు మొదలయ్యాయి. .
ఒకప్పుడు అధికారానికి ప్రతీకగా కనిపించిన ఆ ఫొటో.. ఇప్పుడు వారి రాజకీయ కష్టాలకు గుర్తుగా మారుతుందా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







