పోర్న్ చూస్తే జైలుకే? ఫోన్లో వీడియో ఉన్నా చిక్కులే.. బ్రిటన్ కొత్త రూల్స్!
పోర్న్లో హింసను తగ్గించాలనే ఉద్దేశంతో బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ఇప్పుడు మరో పెద్ద వివాదానికి దారితీస్తోంది. మహిళలపై హింసను ప్రోత్సహించే కంటెంట్‌ను అడ్డుకోవడం మంచిదే. కానీ ఈ క్రమంలో ఏది చూడాలి? ఏది చూడకూడదు? అన్నది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు బ్రిటన్‌లో ఇదే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు కేవలం పోర్న్ పరిశ్రమనే కాదు.. ఆన్లైన్లో వ్యక్తిగత స్వేచ్ఛ, భావప్రకటనా హక్కులపైనా చర్చకు తెరలేపాయి.
హింసాత్మక వీడియోలే టార్గెట్.. కానీ లిస్ట్ చాలా పెద్దదే!
నవంబర్ 6 నుంచి బ్రిటన్‌లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పోర్నోగ్రఫీలో గొంతు నులిమే దృశ్యాలు (Strangulation), ఊపిరి ఆడకుండా చేసే చర్యలు (Suffocation) చూపించే చిత్రాలు, వీడియోలను కలిగి ఉండటం లేదా ప్రచురించడం నేరం. అలాంటి కంటెంట్‌ను పంపిణీ చేసినా, ఫోన్లో లేదా ఇతర డివైజ్‌లలో ఉంచుకున్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే చెబుతోంది. పోర్న్ వీడియోల్లో గొంతు నులిమే సీన్లు కామన్ అయిపోవడంతో, నిజ జీవితంలోనూ కొందరు వాటిని అనుకరించే పరిస్థితి వస్తోందని అంటోంది. పైగా అలాంటి చర్యలు ఎంత ప్రమాదకరమో తెలిసిందే. మెదడుకు శాశ్వత నష్టం జరగొచ్చు. ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. ఇటీవల ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల బాలికని సెక్స్ సమయంలో గొంతు నులిమిన ఘటనలో స్పృహ కోల్పోయి మరణించడం కూడా ఈ అంశంపై చర్చను మరింత పెంచింది.
సవతి సోదరి, సవతి సోదరుడి రోల్‌ప్లే కూడా బ్యానా?
ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రిటన్ ప్రభుత్వం ‘ఫాక్సెస్ట్’ (Fauxcest) అనే పోర్న్ కేటగిరీని కూడా నిషేధించింది. అంటే నిజంగా రక్తసంబంధం లేని వ్యక్తులు కుటుంబ సభ్యుల్లా నటిస్తూ లైంగిక సంబంధాలు ఉన్నట్లు చూపించే వీడియోలన్నమాట. ఉదాహరణకు సవతి సోదరుడు, సవతి సోదరి లేదా సవతి తల్లిదండ్రుల మధ్య సంబంధాలున్నట్లు చూపించే కల్పిత సన్నివేశాలు.
ఇలాంటి వీడియోలు నిజ జీవితంలో పిల్లలపై జరిగే లైంగిక వేధింపులకు ఒక ముసుగులా ఉపయోగపడే ప్రమాదం ఉందని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యురాలు బారోనెస్ గ్యాబీ బెర్టిన్ అభిప్రాయపడ్డారు. ఆమె రూపొందించిన పోర్నోగ్రఫీ సమీక్ష ఆధారంగానే ఈ నిషేధానికి మార్గం ఏర్పడింది. అలాగే 16 ఏళ్లలోపు మైనర్లుగా నటించే పాత్రలతో రూపొందించే లైంగిక కంటెంట్‌పైనా ఆంక్షలు విధించారు.
ఓరల్ సెక్స్ వీడియోలకూ ఎసరు వస్తుందా?
అసలు వివాదం మొదలయ్యేది ఇక్కడే. చట్టంలో గొంతు నులిమే చర్యలతో పాటు ఊపిరి ఆడకుండా చేసే దృశ్యాల గురించి పేర్కొన్న విధానం చాలా విస్తృతంగా ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో బ్రెస్ట్ స్మదరింగ్, ఫేస్ సిట్టింగ్ వంటి కొన్ని కంటెంట్ రకాలతో పాటు ఓరల్ సెక్స్ వీడియోలు కూడా నిషేధం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని బ్రిటన్‌కు చెందిన అబ్సీనిటీ లాయర్ మైల్స్ జాక్మన్ హెచ్చరిస్తున్నారు.
ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే.. ఒక చర్యలో ఊపిరి పీల్చుకునే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుందని భావిస్తే, దాన్ని కూడా ఈ చట్టం కిందకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా అయితే సాధారణంగా భావించే కొన్ని పెద్దల లైంగిక కంటెంట్లపైనా ఆంక్షలు పడొచ్చు. అయితే ఏది నేరం, ఏది కాదన్నది చివరకు కోర్టులే నిర్ణయించాల్సి ఉంటుంది. అయినా చట్టంలోని పదాలే ఇంత గందరగోళానికి కారణమవుతున్నాయన్నది ఆయన అభ్యంతరం.
OnlyFans క్రియేటర్లకు నిద్రలేని రాత్రులు!
ఈ కొత్త చట్టం వల్ల ఇప్పటికే అడల్ట్ కంటెంట్ క్రియేటర్లు టెన్షన్లో పడిపోయారు. తమ పాత వీడియోలు, ఫొటోలు ఎక్కడైనా కొత్త నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయేమోనని లైబ్రరీలన్నీ వెతికి మరీ కంటెంట్ తొలగిస్తున్నారు. అమెరికాకు చెందిన OnlyFans క్రియేటర్ కామి స్ట్రెల్లా తన కంటెంట్‌లో 60 నుంచి 70 శాతం వరకు రోల్‌ప్లే ఉంటుందని చెబుతున్నారు. అవన్నీ కల్పిత పాత్రలతో చేసే ప్రదర్శనలేనని, వాటిని నిషేధించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడుతున్నారు.
పైగా ఒక కంటెంట్‌ను నిషేధిస్తే అది పూర్తిగా మాయమైపోతుందని గ్యారెంటీ లేదని, మరింత రహస్యంగా పనిచేసే ప్లాట్‌ఫామ్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన క్రియేటర్ ట్రాన్స్ ప్రిన్సెస్ జెజెబెల్ కూడా ఇప్పటికే తన పాత వీడియోలను పరిశీలించి తొలగించే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆమె ఆదాయంలో ఈ వీడియోలదే కీలక పాత్ర. కొత్త చట్టం అమల్లోకి రావడంతో తన సంపాదనపై పెద్ద దెబ్బ పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఫోన్లో వీడియో ఉన్నా చిక్కులేనా?
ఈ చట్టంలో చాలామందిని కలవరపెడుతున్న మరో విషయం ఏంటంటే.. వీడియోలను అప్లోడ్ చేయడం, ఇతరులకు పంపించడం మాత్రమే కాదు, వాటిని దగ్గర ఉంచుకోవడం కూడా నేరం కావచ్చు. ఫోన్లో, హార్డ్‌డ్రైవ్‌లో లేదా క్లౌడ్ స్టోరేజ్‌లో అలాంటి చిత్రాలు ఉన్నా చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంటే బ్రిటన్‌కు వెళ్లే విదేశీయులు కూడా తమ ఫోన్లలో ఎలాంటి కంటెంట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. ముఖ్యంగా OnlyFans లాంటి ప్లాట్‌ఫామ్స్‌కు ఈ నిబంధనలు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఆ సంస్థ మాతృసంస్థ ఫెనిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్రిటన్‌లోనే ఉండటంతో అక్కడి చట్టాలను పాటించాల్సిన బాధ్యత మరింత కీలకంగా మారుతుంది. అయితే తాము పనిచేసే అన్ని దేశాల్లోని చట్టాలను పాటిస్తున్నామని, భద్రతా చర్యలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని OnlyFans స్పష్టం చేసింది.
బ్రిటన్‌లో మొదలైన బ్యాన్.. ఇతర దేశాలకూ పాకుతుందా?
ఇదంతా చూస్తుంటే బ్రిటన్‌లో పోర్న్‌పై ఆంక్షలు ఒక్కసారిగా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ పోర్న్ సైట్లలోకి వెళ్లే వినియోగదారుల వయసును నిర్ధారించే నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించని వెబ్సైట్లకు ప్రపంచవ్యాప్త ఆదాయంలో 10 శాతం వరకు జరిమానా విధించే అధికారం అక్కడి మీడియా నియంత్రణ సంస్థ Ofcomకు ఉంది. ఇప్పుడు కొత్త నిషేధాలు కూడా తోడయ్యాయి.
అయితే ఈ చర్చ బ్రిటన్‌కే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. ఇటలీ, నెదర్లాండ్స్, స్పెయిన్లలోనూ ఇలాంటి చట్టాలపై చర్చ జరుగుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని కొన్ని మతపరమైన సంస్థల నుంచి కూడా ఇలాంటి ఆంక్షలకు మద్దతు లభిస్తున్నట్లు సమాచారం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







