కళ్లముందే తిరుగుబాట్లు.. చేతులెత్తేస్తున్న కాంగ్రెస్!
తెలంగాణలో అధికారం దక్కిన నాటి నుంచి ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోవడం కంటే, సొంత పార్టీలోని ఆధిపత్య పోరును నియంత్రించడమే కాంగ్రెస్ అధిష్ఠానానికి పెను సవాలుగా మారింది. నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేతలు.. నియోజకవర్గాల్లో పట్టుకోసం, మంత్రి పదవులకోసం, నామినేటెడ్ పోస్టుల కోసం వీధికెక్కుతుండటంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్నప్పటికీ, పార్టీ యంత్రాంగంపై పట్టు సడలుతోందన్న భావన ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్లు బహిరంగంగానే పార్టీ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పోరాడిన పాత కాపులను పక్కనబెట్టి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గ నిధుల కేటాయింపులో వివక్ష ఎదురవుతోందంటూ సొంత ప్రభుత్వంపైనే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడటం అసమ్మతి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిపాలనాపరమైన సమస్యలను అసెంబ్లీలోనో లేదా అధిష్ఠానం వద్దనో తేల్చుకోవాల్సిన ప్రజాప్రతినిధులే.. నేరుగా మైకుల ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
సమస్యలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరస్పర ఘర్షణల స్థాయికి చేరడం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం, నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య ఢిల్లీ వేదికగా చోటుచేసుకున్న వాగ్వాదం కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి దేశ రాజధానిలో నవ్వులపాలు చేసింది. స్థానిక గాంధీభవన్‌ను దాటి పంచాయితీలు హస్తిన వీధులకు చేరడం, నాయకుల మధ్య సమన్వయం ఏ స్థాయిలో కొరవడిందో స్పష్టం చేస్తోంది.
ఈ మొత్తం పరిణామాలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే ప్రధాన కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలు లేదా చిన్న నాయకులు చిన్నపాటి వ్యాఖ్యలు చేసినా వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసే కమిటీ.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు. సీనియర్ నేతలు బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు చర్యలు తీసుకోకుండా, సమన్వయ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రాజీకి రావడం నాయకులకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఆదేశాలను ఖాతరు చేయకపోయినా, ఢిల్లీలోని తమ గాడ్ఫాదర్ల అండతో బయటపడవచ్చన్న ధీమా నేతల్లో నిండిపోయింది.
రేవంత్ రెడ్డి రాజకీయ నిర్ణయాలను జీర్ణించుకోలేని కొందరు సీనియర్లు, తెరవెనుక ఉండి తమ వర్గం నేతలను ఉసిగొల్పుతున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అటు ముఖ్యమంత్రి, ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఈ గ్రూపు రాజకీయాల తీవ్రతను కట్టడి చేయలేక మౌనం వహించాల్సి వస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నాయకులు చేసే వ్యక్తిగత స్వార్థ ప్రదర్శనలు చివరకు ప్రభుత్వ ప్రతిష్టకే తూట్లు పొడుస్తున్నాయి.
ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీకి మంచి పథకాలు అందించడం ఎంత ముఖ్యమో, శ్రేణుల్లో బలమైన క్రమశిక్షణను కాపాడుకోవడం కూడా అంతే కీలకం. విపక్షాలకు రాజకీయ ఆయుధాలను సొంత నేతలే సమకూరుస్తున్న వేళ.. స్వార్థపూరిత చర్యలపై కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే, తెలంగాణ కాంగ్రెస్ తన గత వైభవంతో పాటు ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.







