బీజేపీ రామచంద్రరావు ముందు పెను సవాళ్లు!
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రణక్షేత్రం అనూహ్య మలుపు తిరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్వయంగా అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకోవడం, అధిష్ఠానం కూడా ఆమోద ముద్ర వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. 2015లో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉన్నప్పటికీ, ప్రస్తుతం యావత్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతిలో ఉన్న వేళ ఈ స్థానానికి పరిమితమై బరిలోకి దిగడం అత్యంత క్లిష్టమైన పొలిటికల్ గ్యాంబుల్ గా విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా రాష్ట్ర అధ్యక్షుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై, రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా దూకుడుగా పోరాడాలి. కానీ, ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడం వల్ల ఆయన తన సమయాన్ని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు, వార్డులు, డివిజన్లలో ఓటర్ల నమోదు, డోర్ టు డోర్ ప్రచారానికే అధికంగా కేటాయించాల్సి వస్తుంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు ఈ వ్యవహారం గండికొడుతుందన్న ఆందోళన కేడర్‌లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి
గ్రాడ్యుయేట్ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగా ఉండవు. ఇక్కడ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు అత్యంత కీలకం. గత 2021 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేసినప్పటికీ, రెండో ప్రాధాన్యతా ఓట్ల ప్రభావంతో ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ ఇప్పటికే సామ రామ్మోహన్ రెడ్డిని బరిలోకి దింపి దూకుడు పెంచగా, బీఆర్ఎస్ కూడా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి త్రిముఖ పోటీలో విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత నుంచి మొదటి ప్రాధాన్యతా ఓట్లతో పాటు స్పష్టమైన మార్జిన్ రాబట్టడం రామచంద్రరావుకు అగ్నిపరీక్ష.
ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఫలితం తారుమారైనా, దాని ప్రభావం నేరుగా రామచంద్రరావు నాయకత్వంపైనే పడుతుంది. రాష్ట్ర అధ్యక్షుడే తన సొంత ఇలాకాలో, విద్యావంతుల స్థానంలో గెలవలేకపోయారనే తీవ్ర విమర్శలను పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా రాష్ట్ర అధ్యక్ష పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన ఒత్తిడి పెరిగే ప్రమాదం లేకపోలేదు.
బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో బండి సంజయ్ సారథ్యంలో కనిపించిన దూకుడు, కేడర్‌లోని తిరుగులేని ఉత్సాహం ప్రస్తుతం కాస్త మందగించిందన్న చర్చ అంతర్గతంగా సాగుతోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ప్రతికూలంగా వస్తే, ఆ కారణాన్ని సాకుగా చూపి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను మళ్లీ మాస్ లీడర్ బండి సంజయ్‌కు అప్పగించే దిశగా హైకమాండ్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందా అన్న సందేహాలు మొదలయ్యాయి.
రామచంద్రరావు వర్గం మాత్రం ఆయనకున్న సీనియర్ న్యాయవాది ఇమేజ్, బార్ కౌన్సిల్ నేపథ్యం, విద్యాసంస్థలతో ఉన్న అనుబంధం తమకు తిరుగులేని బలమని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక అత్యంత సంక్లిష్టమైన డూ ఆర్ డై పోరు. గెలిస్తే తన నాయకత్వాన్ని తిరుగులేకుండా నిరూపించుకుని పార్టీపై పూర్తి పట్టు సాధిస్తారు. ఓడితే మాత్రం పదవిని కోల్పోవడంతో పాటు తెలంగాణ బీజేపీలో పెను నాయకత్వ మార్పునకు తానే కారణమవుతారు.







