ఏపీలో సమస్యలపై నిరసన.. ఎన్నికలను బహిష్కరించిన గ్రామాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార కూటమితో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినప్పటికీ.. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఓటర్లు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. రహదారులు, తాగునీరు, వైద్యం వంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడం నుంచి పోలింగ్ కేంద్రాల మార్పు, రిజర్వేషన్ల వివాదాల వరకు వివిధ కారణాలతో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదు.
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా భీమిలి (Bheemili) మండలం రాయనిపేట గ్రామంలో చెరువు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యకు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు సమస్యను తెలియజేసినా ప్రయోజనం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉన్న మొత్తం 120 మంది ఓటర్లు ఈ నిర్ణయానికి కట్టుబడి పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
చిత్తూరు (Chittoor) జిల్లాలోని ఐరాల మండలం అబ్బుగుండు (Abbu gundu) గ్రామంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో పాటు తాగునీరు, అంగన్వాడీ కేంద్రం వంటి ప్రాథమిక వసతులు కూడా అందుబాటులో లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఇవి కూడా చదవండి
అనంతపురం జిల్లా నెరమెట్ల గ్రామంలోనూ ప్రజలు సామూహికంగా ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. రహదారుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitharama Raju) జిల్లా హుకుంపేట మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ పరిధిలో ఉన్న గొప్పుగరువు, పొర్లు గ్రామాల గిరిజనులు కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తారు రోడ్డు మంజూరు చేసే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టం చేస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు.
తిరుపతి జిల్లా (Tirupati) తొట్టంబేడు మండలం మామిడిగుంట ఎస్సీ కాలనీలో పోలింగ్ కేంద్రం మార్పు వివాదానికి కారణమైంది. గతంలో సమీపంలోని పిల్లమేడు కేంద్రంలో ఓటు వేసిన స్థానికులకు ఈసారి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని దయనేడు కేంద్రాన్ని కేటాయించారు. వయోవృద్ధులు, ఇతర ఓటర్లు అంత దూరం వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇదే మండలంలోని వినాయకపురంలో సుమారు 40 ఏళ్లుగా కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాన్ని అకస్మాత్తుగా మార్చడంపై గ్రామస్థులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా ఓటింగ్‌ను బహిష్కరించారు.
అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని రొంగలివానిపాలెం గ్రామంలో రిజర్వేషన్ల మార్పు వివాదం తెరపైకి వచ్చింది. సర్పంచ్ పదవిని తొలుత బీసీలకు కేటాయించి, ఆ తర్వాత రిజర్వేషన్లో మార్పులు చేయడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికలు ప్రజాస్వామ్యంలో కీలకమైనవే అయినప్పటికీ.. స్థానిక సమస్యల పరిష్కారం జరగకపోతే ప్రజల్లో అసంతృప్తి ఎలా బయటపడుతుందో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఓటు వేయడం ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకోవాలా? లేక సమస్యల పరిష్కారం కోసం ఓటింగ్‌ను బహిష్కరించాలా? అనే చర్చకు ఈ పరిణామాలు తెరతీశాయి.







