అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ కు టీపీసీసీ రిపోర్ట్!
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలో జోష్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆధిపత్య పోరు నడుస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలు కేవలం ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత గొడవలా కాకుండా, పార్టీ క్రమశిక్షణను, నాయకత్వ పట్టును ప్రశ్నార్థకం చేసే స్థాయికి చేరాయి.
ఈ వివాదానికి ప్రధాన కేంద్రం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకమే. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రిగా దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గ పరిధిలో పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే, పక్క జిల్లాకు చెందిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన మరో నేతకు మద్దతు తెలపడం అగ్నికి ఆజ్యం పోసింది. తన జిల్లా రాజకీయాల్లో మరొకరి జోక్యాన్ని మంత్రి తీవ్రంగా వ్యతిరేకించగా, ఎమ్మెల్యేగా తన ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని లక్ష్మీకాంతారావు భావించినట్లు తెలుస్తోంది.
ఈ ఆధిపత్య పోరు అక్కడితే ఆగలేదు. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిష్టాత్మక చలో ఢిల్లీ ర్యాలీ సమయంలో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఓ హోటల్లో ఇరువర్గాల సమక్షంలోనే మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మంత్రి తనను దూషించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వర్గం తీవ్ర ఆరోపణలు గుప్పించింది. అప్పట్లో తెరవెనుక సాగిన ఈ రచ్చ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరువును బజారున పడేసింది.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగడం అనివార్యమైంది. ఢిల్లీ ఘటనపై ఇద్దరి నేతల నుంచి వివరణ కోరేందుకు గాంధీభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం మంత్రిని, మధ్యాహ్నం ఎమ్మెల్యేను విడివిడిగా పిలిచి మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ నిర్ణయించారు. అయితే, సమావేశానికి వస్తానని ముందే మాటిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ చివరి నిమిషంలో రానని తేల్చిచెప్పడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మంత్రి నుంచి ఈ స్పందన రావడం పీసీసీ చీఫ్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. పార్టీ అధికారిక పిలుపునకు, పైగా రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలకు ఒక మంత్రి ఈ విధంగా స్పందించడం కేడర్‌లో చర్చనీయాంశమైంది. తన ఆదేశాలను ధిక్కరించినట్ల భావించిన మహేశ్ కుమార్ గౌడ్.. మధ్యాహ్నం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో జరగాల్సిన భేటీని కూడా రద్దు చేసుకుని వెనుదిరిగారు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పార్టీ అధినాయకత్వానికి కనీస గౌరవం ఇవ్వకపోవడం, క్రమశిక్షణను విస్మరించడంపై పీసీసీ చీఫ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో వర్గపోరును అదుపులో పెట్టలేకపోవడం, మంత్రి స్థాయి వ్యక్తి గాంధీభవన్ పిలుపును సైతం బేఖాతరు చేయడం పీసీసీ నాయకత్వ బలహీనతను ఎత్తిచూపుతోంది. కిందిస్థాయి నేతల నుంచి మంత్రుల వరకు ఎవరి దారిన వారు వెళ్తుంటే, కనీసం వారిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలన్నీ రాష్ట్ర కాంగ్రెస్ పరువుకు భంగం కలిగించేలా ఉండటంతో, మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌గా స్పందించారు. ఇరువర్గాల వ్యవహారశైలిపై సమగ్రమైన నివేదికను సిద్ధం చేసి, తక్షణమే కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ కొత్త వివాదం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఢిల్లీ పెద్దలు ఈ అంతర్గత కుమ్ములాటలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, క్రమశిక్షణారాహిత్యాన్ని ఎలా అణచివేస్తారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.







