ఓటు పోయిందా..? అయితే గుడ్ న్యూస్..!
ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా వివిధ కారణాల వల్ల ఓటు హక్కు కోల్పోయిన వారు, తమ పేర్లను తిరిగి ఓటర్ల లిస్ట్‌లో చేర్చుకునేందుకు ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సరికొత్త అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఢిల్లీతో సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది.
గతంలో ఓటు ఉండి ఇప్పుడు పేరు గల్లంతైన వారు కొత్త ఓటు కోసం ఇచ్చే ఫారమ్-6 పూరిస్తే.. ఎక్కడ చట్టపరమైన ఇబ్బందులు వస్తాయోనని భయపడే అవసరం లేదని ఎన్నికల సంఘం భరోసా ఇచ్చింది. దేశంలో మరే ఇతర నియోజకవర్గంలోనూ ఓటు లేనంత వరకు, ప్రస్తుత డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు లేని పాత ఓటర్లు నిరభ్యంతరంగా ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనిని తప్పుడు ప్రకటనగా పరిగణించబోమని, ఓటర్లపై ఎలాంటి కేసులు నమోదు కావని ఈసీ క్లారిటీ ఇచ్చింది.
ఓటు హక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరూ ఈ సదవరణాన్ని ఉపయోగించుకుని తమ పేరును ఓటర్ల జాబితాలో పునరుద్ధరించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అర్హులైన పౌరులు తమ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO)ను నేరుగా సంప్రదించి ఆఫ్ లైన్ ద్వారా గానీ, లేదా అధికారిక ఓటర్ల పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా గానీ తమ ఎన్యుమరేషన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ గడువు సడలింపు ఇచ్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.







