20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్.. ఢిల్లీ పౌరులకు ఊరట…!
ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదర్శన స్థలమైన జంతర్ మంతర్ (Jantar Mantar) పేరు చెప్పగానే .. ముందుగా మనకు గుర్తొచ్చేవి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగే ఏ ఆందోళన అయినా ఇక్కడే జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఈ ఆందోళనల వల్ల ఆ ప్రదేశం..నిత్యం పోలీసుల క్రీనీడలో ఉంటూ వస్తోంది. గత ఇరవై ఏళ్లుగా ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది..
జంతర్ మంతర్ ప్రాంతానికి చెందిన రోడ్డు దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ పూర్తిగా తెరుచుకుంది. భద్రతా సమీక్ష అనంతరం, రాజధానిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను పూర్తిగా తొలగించాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న శాశ్వత, తాత్కాలిక నాకాబంధీలు తొలగించడంతో అశోక్ రోడ్డును (Ashoka Road) టాప్స్టాయ్ మార్గ్‌తో కలిపే ఈ ప్రధాన రహదారిలో సాధారణ వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. దీనివల్ల ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే డైలీ కమ్యూటర్లకు (Daily commuters) ఎంతో ఊరట లభించడమే కాకుండా, చుట్టూ తిరిగి వెళ్లే తిప్పలు కూడా తప్పాయి.
ఇవి కూడా చదవండి
ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) చేపట్టిన నిరసన ప్రదర్శనల అనంతరం, గత నెలలోనే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రాంతాల జాబితా నుంచి తొలగించారు. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా భద్రతా ఏజెన్సీలు ఇక్కడ ఆంక్షలు కొనసాగించాయి. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోవడంతో, ఉన్నతాధికారులు సమీక్ష జరిపి బారికేడ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.
ఇక, చారిత్రకంగా జంతర్ మంతర్ అనేక ప్రజా ఉద్యమాలకు, నిరసనలకు (Protests) కేంద్రబిందువుగా నిలిచింది. 1990ల ప్రారంభంలో, ముఖ్యంగా 1993 తర్వాత పార్లమెంటు (Parliament) సమీపంలో తమ నిరసనలు తెలిపేందుకు వచ్చే వారిని అనధికారికంగా ఈ రోడ్డు వైపే మళ్లించేవారు. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమాలు, ధర్నాలకు ఇది ప్రధాన వేదికగా మారింది. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే (Anna Hazare) చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం కూడా ఇక్కడే ప్రారంభమై, ఆ తర్వాత రామ్‌లీలా మైదానానికి (Ramlila Maidan) మారింది. అంతేకాకుండా 2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ (Nirbhaya) దారుణ సంఘటన తర్వాత, న్యాయం, మహిళల భద్రత కోసం వేలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి నిరసన తెలిపింది కూడా ఈ జంతర్ మంతర్ వద్దే కావడం గమనార్హం.







