టెంపరరీ చిల్డ్రన్ కావాలా.. ? చైనాలో సరికొత్త ట్రెండ్..!
చైనాలో జనాభా దారుణంగా పతనమవుతోంది. యూత్ పెళ్లి చేసుకోవాలి..పిల్లల్ని కనాలి అన్న ధోరణికి దూరంగా ఉంటూ వస్తున్నారు. యూత్ ను పెళ్లిజంట చేసేందుకు అక్కడి అధికారులు ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా అవి పెద్దగా ఫలితమివ్వడం లేదు. ఎందుకంటే.. అక్కడి ఎకానమీ పరిస్థితి అలా ఉంది. యువత… కెరియర్ పై ఫోకస్ పెడుతోంది. పెళ్లి, పిల్లలంటే తమ జీవితం అక్కడితో ఆగిపోతుందన్న భయం వారిని వెంటాడుతోంది.దీంతో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాగుపోతంది.
అక్కడి వరకూ ఓకె.. కానీ మరీ ముసలి వారి సంగతేంటి.. వారిని ఎవరు చూసుకుంటారు. దీనికి సమాధానంగా ఓకొత్త ట్రెండ్ పురుడు పోసుకోవడమే కాదు.. శరవేగంగా విస్తరిస్తోంది కూడా. అది టెంపరరీ చిల్డ్రన్. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు తోడుగా ఉంటూ, వారి పనుల్లో సాయపడేందుకు యువతీయువకులను కిరాయికి నియమించుకునే ‘తాత్కాలిక సంతానం’ (టెంపరరీ చిల్డ్రన్) వ్యాపారం ఊపందుకుంది. ఈ ‘సహచర ఆర్థిక వ్యవస్థ’ (కంపానియన్‌షిప్ ఎకానమీ) విలువ ఇప్పటికే 7.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 61,000 కోట్లకు పైగా) చేరిందంటే దీనికి పెరుగుతున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.
డబ్బు తీసుకుని సేవలు..
ఈ ‘తాత్కాలిక పిల్లలు’ బంధువులు కారు. వీరు డబ్బు తీసుకుని వృద్ధులకు సేవలు అందిస్తారు. రోజూ రెండు పూటలా భోజనం తీసుకురావడం, ఆసుపత్రికి తోడుగా వెళ్లి కావాల్సిన పత్రాలు సిద్ధం చేయడం, మందులు తీసుకురావడం వంటివి వీరి బాధ్యతలు. అంతేకాకుండా, ఇంట్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టడం, ఒంటరితనాన్ని దూరం చేయడానికి వారితో మాట్లాడటం వంటి భావోద్వేగపరమైన మద్దతును కూడా అందిస్తారు. భర్త చనిపోయి, కంటిచూపు మందగించడంతో బీజింగ్‌కు చెందిన 91 ఏళ్ల వృద్ధురాలు టీవీతోనే మాట్లాడుకునేది. ఇప్పుడు ‘తాత్కాలిక పిల్లలు’ ఆమెకు భోజనం అందిస్తూ, ఇంట్లో సాయం చేస్తూ తోడుగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఎందుకీ పరిస్థితి?
చైనాలో ఈ వినూత్న పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
దశాబ్దాల పాటు అమలైన ‘ఒకే బిడ్డ’ విధానం వల్ల చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఒక్కరిపైనే పడింది. వారు తమ ఉద్యోగాలు, పిల్లల పెంపకంతో సతమతమవుతూ తల్లిదండ్రులకు సమయం కేటాయించలేకపోతున్నారు.
వలసలు:
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువతరం నగరాలకు వలస వెళ్లడంతో, గ్రామాల్లో వృద్ధ తల్లిదండ్రులు ఒంటరవుతున్నారు. వీడియో కాల్స్‌లో మాట్లాడినా, ప్రత్యక్షంగా తోడుగా ఉండటానికి అవి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి.
జనాభా:
చైనాలో వృద్ధుల జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2025 చివరి నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 32 కోట్లకు, 2035 నాటికి 40 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ డిమాండ్‌కు తగినట్లు నిపుణులైన కేర్ వర్కర్లు అందుబాటులో లేరు.







