ట్రంప్ ఇక వీటో ప్రెసిడెంట్.. !
మధ్యంతర ఎన్నికలతో అమెరికా రాజకీయాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా పాలనకు గుండెకాయల్లాంటి ప్రతినిధుల సభ, సెనెట్.. రెండూ డెమోక్రాట్ల నియంత్రణలోకి వచ్చాయి. ఇది దేశాధ్యక్షుడు ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బే. దేశీయంగా పరిపాలనాపరమైన అంశాల్లోగానీ, విదేశాంగ విధానాల్లోగానీ ఇకపై ఆయన దూకుడుగా వ్యవహరించలేరు! తాజా ఎన్నికలు అమెరికాలో ప్రధానంగా పాలనపరమైన మార్పులకు కారణం కానున్నాయి.
మునుపటిలా ట్రంప్.. ఇక పాలనా నిర్ణయాల్లో దూకుడు ప్రదర్శించలేరు. ఎందుకంటే డెమొక్రాట్లను కాదని.. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దానిపై డెమోక్రాట్లు అభ్యంతరం చెప్పవచ్చు. వారి మద్దతు లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. లేదంటే ప్రతీదానికి అధ్యక్షుడికి ఉన్న విశేషాధికారం వీటోను వాడాల్సి వస్తుంది.
ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనెట్.. ఇరాన్‌తో యుద్ధం సహా పలు అంశాలపై విచారణ జరపవచ్చు. యుద్ధం కోసం చేసిన ఖర్చు లెక్కలు అడగవచ్చు. ప్రభుత్వ ఒప్పందాలను వారు పరిశీలించవచ్చు. వలసల విధానాలను ప్రశ్నించవచ్చు. అధ్యక్షుడి నిర్ణయాలకు సంబంధించిన పత్రాలు కోరవచ్చు. ఈ పరిణామాలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
నిర్ణయాల అమలులో ప్రతిష్టంభన
ఇన్నాళ్లూ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లకు ఆధిక్యం ఉండటంతో.. ట్రంప్ ప్రతిపాదించిన విధానాలకు అడ్డంకులు ఎదురుకాలేదు. ఇకపై ఆయన ప్రతిపాదించే చట్టాలను డెమోక్రాట్లు అడ్డుకోవచ్చు. అధ్యక్షుడి నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ అధికారుల నుంచి వివరణలు కోరవచ్చు. ఫలితంగా ప్రభుత్వ నిర్ణయాలు, వాటి అమలులో ప్రతిష్టంభన తలెత్తొచ్చు.
కార్యనిర్వహణాధికారాల వినియోగం
కాంగ్రెస్‌లో తన ప్రతిపాదనలు ఆమోదం పొందడం కష్టమైతే.. అధ్యక్షుడిగా కార్యనిర్వహణాధికారాలను ట్రంప్ ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది. వీటో అధికారాన్ని ఉపయోగించి.. కాంగ్రెస్ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారకుండా ఆయన అడ్డుకోవచ్చు.
డెమోక్రాట్ల చేతికి.. ఖర్చుల నియంత్రణ
ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేయాలి.. ఎందుకోసం ఖర్చు చేయాలి.. అనేది నిర్ణయించడంలో కాంగ్రెస్‌ది కీలక పాత్ర. ఇకపై డెమోక్రాట్లు ప్రభుత్వ ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఇరాన్‌తో యుద్ధానికి అదనపు నిధులు కేటాయించేందుకు వారు అభ్యంతరం తెలపొచ్చు.
కీలక నియామకాలను అడ్డుకోవడం
అమెరికాలో కీలక ప్రభుత్వ పదవులకు అధ్యక్షుడు పేర్లను ప్రతిపాదిస్తారు. వాటిలో చాలా నియామకాలకు సెనెట్ ఆమోదం అవసరం. ఇకపై డెమోక్రాట్లు ట్రంప్ ప్రతిపాదించిన కొందరు అధికారుల నియామకాలను అడ్డుకోవచ్చు. లేదా ఆలస్యం చేయవచ్చు.
అధ్యక్షుడిని అభిశంసించగలరా?
ట్రంప్ రాజ్యాంగ ఉల్లంఘన లేదా ఇతర తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారని భావిస్తే డెమోక్రాట్లు ఆయన్ను అభిశంసించే ప్రక్రియను ప్రారంభించవచ్చు. అయితే అది సఫలమవడం సులువు కాదు. అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో ఆమోదం పొందాలి. తర్వాత సెనెట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీతో తీర్మానం పాసవ్వాలి.







