ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ స్పీడ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం (AP Liquor Scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ అధికారుల అభ్యర్థనకు హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈశ్వర్ రెడ్డిని పీటీ వారెంట్‌పై కోర్టు ముందు హాజరుపరిచిన అధికారులు, అనంతరం తమ కస్టడీలోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
లిక్కర్ స్కామ్ ద్వారా వసూలైన కోట్ల రూపాయల ముడుపుల సొమ్మును దారి మళ్లించడంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్ల నుండి వచ్చిన అక్రమ డబ్బును వివిధ షెల్ కంపెనీల ద్వారా వైట్ మనీగా మార్చడం, హవాలా రూపంలో తరలించడం వంటి వ్యవహారాల్లో ఈయన హస్తం ఉందనే కోణంలో ఈడీ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ రెండు రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఈ అక్రమ నిధుల ప్రవాహం ఎటు నుండి ఎటు సాగింది..? ఏయే కంపెనీలను ఇందుకు వేదికగా వాడుకున్నారు..? అనే విషయాలపై ఈడీ అధికారులు ఈశ్వర్‌ను ప్రశ్నించనున్నారు.
ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడని ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి మధ్య నడిచిన సుదీర్ఘ ఆర్థిక లావాదేవీల రికార్డులను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ వెనుక ఉన్న పొలిటికల్ లీడర్లు ఎవరు? మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది? అనే విషయాలపై ఈశ్వర్ రెడ్డి నోరు విప్పితే మరికొన్ని సంచలన అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. అంతకుముందు ఈ కేసులో ఈశ్వర్ రెడ్డికి కోర్టు నవంబర్ 16వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈడీ కస్టడీలో జరుగుతున్న విచారణ ముగిసిన అనంతరం, లభించిన సమాచారంతో ఈ కుంభకోణంలో ఉన్న మరికొందరు పెద్ద తలకాయలకు ఈడీ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.







