O.C.I ఉన్నంతమాత్రాన భారతీయులతో సమానహక్కులుండవు..
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్ కేసు విచారణలో బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ (ఆమిర్ ఖాన్ మేనల్లుడు).. భారత అంతర్గత రాజకీయ నిరసనల్లో భాగస్వామి కావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నటుడు ఇమ్రాన్ ఖాన్ పై కోర్టు సీరియస్ అయింది.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 10న ముంబైలో నిర్వహించిన నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, తక్షణమే దేశం విడిచి వెళ్లాలని (లీవ్ ఇండియా) నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఇవి కూడా చదవండి
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ మహేశ్చంద్ర త్రిపాఠి నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “అమెరికా పౌరుడై ఉండి భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలో ఎలా పాల్గొంటారు? ఒకవేళ భారతీయులు అమెరికాలో ఇలాంటి చర్యలకు పాల్పడితే అక్కడి ప్రభుత్వం సహిస్తుందా?” అని కోర్టు నిలదీసింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్నంత మాత్రాన, రాజకీయ కార్యక్రమాలు లేదా నిరసనల్లో పాల్గొనేందుకు భారత పౌరులతో సమానమైన హక్కులు లభించవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇమ్రాన్ ఖాన్ న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు తెలియజేశాడు. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ నిరసనల్లో పాల్గొనబోనని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసులపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 7కి వాయిదా వేసింది.







