మంత్రి vs ఎంపీ.. కాంగ్రెస్‌లో మరో వర్గపోరు
కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ. ఎవరు ఎవరి పైన అయినా కామెంట్స్ చేసేస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇద్దరు ప్రముఖుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇరువురు నేతల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. శ్రీధర్ బాబును ఉద్దేశించి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది.
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనే సంకల్పంతో, బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ హాజరుకాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రి శ్రీధర్ బాబుకు రాసిన ఒక లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆ సభకు గైర్హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవద్దని, వారిని సస్పెండ్ చేయవద్దంటూ వంశీకృష్ణ ఆ లేఖలో వ్యంగ్యంగా కోరారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారని, అదే సమయంలో పార్టీ అత్యంత కీలకంగా భావించిన ఢిల్లీ సభను విస్మరించడంపై ఎంపీ వంశీకృష్ణ పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో గడ్డం వంశీకృష్ణ ప్రస్తావించిన మరో పాత అంశం పెద్దపల్లి రాజకీయాల్లో అసలు దుమారానికి కారణమైంది. గతంలో కాకా వెంకటస్వామి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోయూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. దానిని తప్పుపడుతూ ఒక గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వంశీకృష్ణ తన లేఖలో గుర్తుచేశారు. పేద పిల్లలకు మంచి చేయడం తప్పైతే, అంతటి జాతీయ స్థాయి సభకు గైర్హాజరు కావడం ఎంత పెద్ద తప్పు అని ఆయన నిలదీశారు.
“మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా లేక గిరిజన వార్డు సభ్యుడైనా కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకే రకమైన న్యాయం, ఒకే నియమం వర్తించాలి” అని వంశీకృష్ణ తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. సాధారణ కార్యకర్తలు లేదా మహిళా ప్రతినిధుల పట్ల కఠినంగా వ్యవహరించే నాయకులు, అదే నిబంధనలను అగ్రనేతల విషయంలోనూ వర్తింపజేయాలని ఆయన పరోక్షంగా హితవు పలికారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న శ్రీధర్ బాబు, గడ్డం కుటుంబాల మధ్య విభేదాలు ముదురుతుండటం పార్టీ కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ ఎంపీయే ఒక కేబినెట్ మంత్రికి లేఖాస్త్రం సంధించడం, అది కూడా వ్యంగ్యధోరణిలో ఉండటం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ, అనిరుధ్ రెడ్డి లాంటి నేతలు పార్టీ తీరుపైన, ప్రభుత్వంపైన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ, మంత్రి వ్యవహారం మరో పెద్ద సమస్యగా మారింది.







