అమిత్ షా పర్యటనతో బీజేపీలో నూతనోత్సాహం!
హైదరాబాద్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన మహాపాదయాత్ర, బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టించాయి. నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఎంజే మార్కెట్ వరకు వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆయన స్వయంగా పాదయాత్రను నడిపించడం రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుంటూ అమిత్ షా సంధించిన రాజకీయ అస్త్రాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభపై అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అది ‘ఓటు బచావో’ సభ కాదని, దేశ భద్రతను పణంగా పెట్టి చొరబాటుదారులను కాపాడే సభ అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అక్రమ చొరబాటుదారులను వెనకేసుకొస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. దొంగ ఓట్లను ఏమాత్రం సహించేది లేదని, ప్రతి చొరబాటుదారుడి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా దేశ సరిహద్దుల నుంచే శాశ్వతంగా తరిమికొడతామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ జీవితంలో ఎప్పటికీ ప్రధాని కాలేరని ఎద్దేవా చేస్తూ ఆయన వ్యక్తిగత మహారాజా ఆశలపై నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ‘RR’ ట్యాక్స్ నడుస్తోందని, ఆ అంటే రాహుల్… ఆర్ అంటే రేవంత్ అని అభివర్ణించారు. ఇక్కడ వసూలు చేస్తున్న ఈ ప్రత్యేక ట్యాక్స్ సొమ్ము ఎక్కడికి వెళ్తుందోనంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఢిల్లీ దర్బార్‌కు ఏటీఎంలా మార్చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని, వాటికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ఈ విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులలో ఈ పర్యటన భారీ ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల కాలంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ మహాపాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా స్థానిక అంశాలను, జాతీయ భద్రతా కోణాలను ముడిపెట్టి అమిత్ షా చేసిన ప్రసంగం కిందిస్థాయి క్యాడర్లో సరికొత్త దూకుడును తెచ్చింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించడానికి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈ సభ ఒక బలమైన వేదికగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు ఈ రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.







