ఢిల్లీలో కొట్టుకున్నంత పని చేసిన మంత్రి, ఎమ్మెల్యే!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. అయితే నామినేటెడ్ పదవులు, పార్టీ నియామకాల విషయంలో నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఇప్పుడు రోడ్డున పడింది. తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన తీవ్ర వాగ్వాదం, బెదిరింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రముఖ ‘సంగ్రీలా’ హోటల్ లాబీలో తోటి ఎమ్మెల్యేలు, నాయకుల సమక్షంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులతో పాటు ఇతర పార్టీ పదవుల నియామకాల విషయంలో గత కొద్దివారాలుగా ఇరువర్గాల మధ్య అంతర్గత చర్చలు, విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. తనకు తెలియకుండా అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతూ కొందరికి డీసీసీ పదవులు ఇప్పిస్తున్నారంటూ మంత్రి రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ముదిరిపోవడంతో మంత్రి తీవ్ర పదజాలంతో దూషించారని, తనను శారీరకంగా దాడి చేస్తానని బెదిరించారని లక్ష్మీకాంతరావు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ అనూహ్య పరిణామంపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తీవ్రంగా స్పందించారు. మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్‌లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, ఈ ఉదంతాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, కీలకమైన పదవుల పంపకాల విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్యే బహిరంగంగా ఘర్షణలు తలెత్తడం పార్టీ హైకమాండ్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో పట్టు నిలుపుకోవడానికి సీనియర్ నాయకులు ప్రయత్నిస్తుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతను చాటుకునేందుకు చూస్తున్న తరుణంలో ఈ ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది.
ఈ ఘటన కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును బహిర్గతం చేయడమే కాకుండా, రాబోయే రోజుల్లో సంస్థాగత నియామకాల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్న వేళ, ఇలాంటి అంతర్గత వివాదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదంపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య ఎలా కుదురుస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.







