ఎలుకను చంపిన కేసులో నలుగురిపై FIR.. అసలు ఏం జరిగిందంటే?
ఎలుకను చంపితే కూడా కేసు పెడతారా? అని కొందరికి ఆశ్చర్యం కలగొచ్చు. మరీ చట్టాలు ఇంత కఠినంగా మారాయా అనిపించవచ్చు. ఆ ఎలుక వీళ్లను ఎంత ఇబ్బంది పెట్టిందో.. దాని బాధ భరించలేకే అలా చేసి ఉంటారేమో అని నిందితుల వైపు నుంచి కూడా ఆలోచించవచ్చు. అయితే ఎలుకను చంపితే ఎందుకు వాళ్ళపై FIR నమోదు చేయాల్సి వచ్చింది. సభ్య సమాజం వాళ్ళను ఎందుకు ఈసడించుకుంటోంది వంటివి తెలియాలంటే మాత్రం పూర్తి విషయం తెలుసుకోవాల్సిందే. ఒక జీవిని చంపడానికి ఎంచుకున్న పద్ధతి, దాన్ని చూస్తూ వీడియో తీయాలనుకున్న ఆలోచన వెనుక ఉన్న మనస్తత్వం గురించి మాత్రం ఆలోచించాల్సిందే. మనుషుల్లో క్రూరత్వం సాధారణ విషయంగా మారిపోతోందా? అనే ప్రశ్న కూడా ఇలాంటి ఘటనలతో ఎదురవుతోంది.
ఝాన్సీలో ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓర్చా గేట్ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ బతికున్న ఎలుకపై మండే స్వభావం ఉన్న పదార్థాన్ని పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
ఒక చిన్న జీవిని చంపడం కంటే, దాన్ని హింసించే విధానమే ఈ ఘటనలో చర్చకు కారణమైంది. వీడియో బయటకు రావడంతో జంతువుల పట్ల క్రూరత్వంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది.
నలుగురిపై FIR నమోదు
వైరల్ వీడియోను పరిశీలించిన కోత్వాలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. జునైద్ ఖురేషీ, జీషాన్ ఖురేషీ, ఆశిక్ ఖురేషీ, షఫీక్ అనే నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. వీరంతా ఝాన్సీలోని ఓర్చా గేట్ ప్రాంతానికి చెందినవారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద శుక్రవారం FIR నమోదు చేశారు. సిటీ సర్కిల్ ఆఫీసర్ ప్రియా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
క్రూరత్వం వెనుక ఎలాంటి మనస్తత్వం ఉంటుంది?
సైకాలజీ కోణంలో చూస్తే.. ఇతర జీవుల బాధను పట్టించుకోకపోవడం, వాటిని హింసించడంలో వినోదాన్ని వెతుక్కోవడం ఆందోళన కలిగించే ప్రవర్తన. ముఖ్యంగా ఒక జీవి బాధపడుతున్నప్పుడు దాని పట్ల కనీస జాలి కూడా చూపించకపోవడం, దాన్ని ఒక వినోద వస్తువులా చూడటం సమస్యాత్మకమైన ధోరణి.
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ఒకరు హింసాత్మకంగా ప్రవర్తిస్తే, చుట్టూ ఉన్నవారు దాన్ని ఆపకుండా చూస్తూ ఉండటం లేదా వీడియో తీయడం కూడా ఆ ప్రవర్తనకు పరోక్షంగా ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించడం మరింత ఆందోళనకరం.
హింసను చిన్నదిగా చూడటం కూడా ప్రమాదమే!
జంతువులపై క్రూరత్వాన్ని కొన్నిసార్లు చిన్న విషయంగా తీసుకుంటారు. అది కేవలం ఒక ఎలుకే కదా, ఒక కుక్కే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఒక జీవి బాధను గుర్తించలేని లేదా పట్టించుకోని మనస్తత్వాన్ని సమాజం సాధారణంగా అంగీకరించడం మంచిది కాదు.
ఇలాంటి ఘటనలను కేవలం సోషల్ మీడియా వైరల్ వార్తలుగా చూసి వదిలేయకుండా, వాటి వెనుక ఉన్న ప్రవర్తనా ధోరణులపై కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఈ రోజు చిన్న జీవి పట్ల వ్యవహరించినట్లే రేపు సాటి మనుష్యుల పట్ల కూడా వ్యవహరించే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిని మొదట్లోనే అరికట్టాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







