డెమోక్రాట్లు గెలిస్తే.. ట్రంప్ ఎదుర్కోబోయే నాలుగు కీలక విచారణలు ఇవే!
చూస్తుంటే…అమెరికా రాజకీయాల్లో నెక్స్ట్ గేమ్ మామూలుగా ఉండేలా లేదు! ఇన్నాళ్ళూ తన నిర్ణయాలతో ప్రత్యర్థులకు షాకులిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. ఎన్నికల తర్వాత అదే స్థాయిలో షాక్ తగిలేలా కనపడుతోంది. నవంబర్ 3న జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే సీన్ మొత్తం మారిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రంప్ కుటుంబ వ్యాపారాల నుంచి ఇరాన్ యుద్ధం వరకు.. ఏకంగా నాలుగు అంశాలపై విచారణలకు ప్లాన్ చేస్తున్నారు. అంటే వైట్‌హౌస్‌కు ప్రశ్నల సెగ తప్పదన్నమాట!
కాంగ్రెస్‌లో మెజారిటీ వస్తే డెమోక్రాట్లకు ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచే, కీలక పత్రాలు సమర్పించాలని ఆదేశించే అధికారం ఉంటుంది. ఇప్పటికే ఎవరిని టార్గెట్ చేయాలి? ఏయే అంశాలను తవ్వాలి? అనే దానిపై కసరత్తు మొదలైనట్లు సమాచారం. మరి ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టగల ఆ నాలుగు అంశాలేంటో చూద్దాం.
1. ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్.. అసలు లెక్కలు బయటపడతాయా?
ట్రంప్ కుటుంబానికి ఉన్న వ్యాపార సామ్రాజ్యమే డెమోక్రాట్ల మొదటి టార్గెట్. ముఖ్యంగా క్రిప్టో కంపెనీలతో ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలపై విచారణ జరపాలని భావిస్తున్నారు.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం.. ఖతార్ ప్రభుత్వం అమెరికాకు బహుమతిగా ఇచ్చిన సుమారు 400 మిలియన్ డాలర్ల విమానం! మన కరెన్సీలో దాదాపు రూ.3,500 కోట్లకు పైమాటే. ఈ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించే వ్యవహారంపైనా ప్రశ్నలు రావచ్చు. ట్రంప్ కుటుంబంతో సంబంధాలున్న కంపెనీలకు భారీ రక్షణ రంగ కాంట్రాక్టులు ఎలా వచ్చాయనేది కూడా పరిశీలించనున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే.. అధ్యక్షుడి అధికారంతో కుటుంబ వ్యాపారాలకు ఏమైనా లాభం జరిగిందా? ప్రజల డబ్బు ఎలా ఖర్చవుతోంది? అనేదే డెమోక్రాట్లు తేల్చాలనుకుంటున్న అంశం. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం అవినీతి ఆరోపణలను ఖండిస్తోంది.
2. ఇరాన్ యుద్ధం.. రక్షణ శాఖకు ప్రశ్నల మోత!
రెండో టార్గెట్ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్. ఇరాన్‌తో యుద్ధంలో ఎంతమంది పౌరులు చనిపోయారు? సైనికులకు సరిపడా ఆయుధాలు ఉన్నాయా? యుద్ధానికి సరైన ప్రణాళిక ఉందా? అనే ప్రశ్నలతో పెంటగాన్‌ను డెమోక్రాట్లు నిలదీయాలనుకుంటున్నారు.
అంతేకాదు, కరేబియన్ ప్రాంతంలో అమెరికా చేపట్టిన పడవలపై దాడుల వ్యవహారం కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికే ఈ దాడులు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. వాటి వెనుక ఉన్న అసలు కారణాలపై డెమోక్రాట్లు ఫోకస్ పెట్టనున్నారు.
మరో కీలకమైన ప్రశ్న కూడా ఉంది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్? ఈ అంశంపై ఇప్పటికే హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. విచారణలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే హెగ్సెత్ పదవికే ఎసరు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
3. ICE దాడులు.. ట్రంప్ వలస విధానాలకు ఎదురుదెబ్బ?
అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేయడం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీ. కానీ ఇప్పుడు అదే విధానం చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. అమెరికా అంతటా ICE అధికారులు నిర్వహిస్తున్న దాడులు, అరెస్టులు, నిర్బంధాలపై డెమోక్రాట్లు విచారణ జరపాలని చూస్తున్నారు.
అధికారులు దాడుల సమయంలో నిబంధనలు పాటిస్తున్నారా? వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారా? అధికార దుర్వినియోగం జరుగుతోందా? అనేవి ప్రధాన ప్రశ్నలు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2024లో ట్రంప్‌కు ఓటేసిన కొందరు అమెరికన్లు కూడా ICE అధికారుల కొన్ని పద్ధతులపై అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. అంటే అక్రమ వలసలను అడ్డుకోవడానికి మద్దతు ఉన్నా.. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నా ఓకే అనే పరిస్థితి లేదన్నమాట. ఈ అంశం డెమోక్రాట్లకు కీలకంగా మారవచ్చు.
4. ట్రంప్‌కు మూడోసారి అభిశంసన ముప్పు?
ఇదే అన్నింటికంటే హాట్ టాపిక్! ట్రంప్ ఇప్పటికే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మూడోసారి కూడా అదే పరిస్థితి వస్తుందా? అనే చర్చ డెమోక్రాట్లలో మొదలైంది.
అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి నేతలు ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, ఇతర వివాదాస్పద నిర్ణయాలను కారణాలుగా చూపిస్తున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాస్ అయినంత మాత్రాన ట్రంప్ పదవి పోదు. సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాలి. అది అంత ఈజీ కాదు. అందుకే అభిశంసన మొదలుపెట్టాలా? వద్దా? అనే విషయంలో డెమోక్రాట్లలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అసలు గేమ్ ఇప్పుడే మొదలవుతుందా?
ఈ నాలుగు విచారణలు మొదలైతే ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కొత్త తలనొప్పులు తప్పకపోవచ్చు. అయితే విచారణలు మొదలవడం అంటే ఆరోపణలు నిజమని తేలిపోయినట్లు కాదు. ఆధారాలు ఏం చెబుతాయి? ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఇస్తుంది? అనేదే కీలకం.
ఇన్నాళ్లూ ట్రంప్ ప్రత్యర్థులను ప్రశ్నించారు.. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో లెక్కలు మారితే ఆయనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావచ్చు. ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ నుంచి ఇరాన్ యుద్ధం వరకు.. ఏ ఒక్క అంశం ఆయనకు పెద్ద రాజకీయ తలనొప్పిగా మారుతుందో చూడాలి!
— సూర్య ప్రకాష్ జోశ్యుల







