బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే!?
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సామాజిక, సమర్థులైన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ తో పాటు వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటరు నమోదు ప్రక్రియ సాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే కేవలం సాధారణ ఎన్నికల్లా కాకుండా మేధావులు, నిరుద్యోగులు, ఉద్యోగుల నాడిని పట్టే వేదికలుగా ఉంటాయి. అందుకే బీఆర్ఎస్ అధిష్టానం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ స్థానాల నుంచి కాసాని వీరేష్ ముదిరాజ్, ఏనుగుల రాకేష్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారయినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానం నుంచి కాసాని వీరేష్ ముదిరాజ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. దివంగత నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కుమారుడిగా వీరేశ్ ముదిరాజు సుపరిచితులు. వీరేశ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా బలమైన ముదిరాజ్, బీసీ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ముదిరాజ్ ల బలం ఎక్కువ. ఇది కచ్చితంగా విజయానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి యువ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గతంలోనూ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డికి ఉంది. విద్యావర్గాల్లో మంచి పట్టు కలిగి ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని పట్టభద్రులను చైతన్యం చేయడంలో ఆయన ముందుంటారనే నమ్మకంతో పార్టీ ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అనుభవం.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు.
ఈ ఇద్దరు అభ్యర్థులు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నాయకులే కావడం విశేషం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ కాషాయ పార్టీని వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారినప్పటికీ వారిద్దరికీ ఉన్న వ్యక్తిగత క్యాడర్, దూకుడుగా మాట్లాడే శైలి, యువతలో ఉన్న ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో కలిసివస్తాయని అధిష్టానం అంచనా వేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నమ్ముతోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తోంది.







