అమిత్ షా పాదయాత్రకు సర్వం సిద్ధం!
దేశ రాజధానిలో ప్రారంభమైన రాజకీయ ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు పాకాయి. “లోక్ తంత్ర బచావో, అరాచకత హటావో” అనే నినాదంతో అధికార కాంగ్రెస్, ఇండియా కూటమి ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లో అమిత్ షా ‘మహా పాదయాత్ర’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు బషీర్బాగ్లోని నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అమిత్ షా పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అబిడ్స్ మీదుగా సాగి, సాయంత్రం 6:00 గంటలకు ఎంజే మార్కెట్ వద్ద ముగుస్తుంది. అమిత్ షా ఈ సందర్భంగా నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పాదయాత్ర ఏర్పాట్లను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారమే స్వయంగా పరిశీలించారు. భద్రత, రూట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ కూటమి, కాంగ్రెస్ పార్టీలు దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదైన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 8 లక్షల మంది ఓటర్లు ఉంటే కేవలం 3.5 లక్షల ఓట్లు మాత్రమే పోలవుతున్నాయని, దీనికి కారణం చాలామంది వలస కార్మికులు తమ స్వగ్రామాల్లో కూడా ఓట్లు కలిగి ఉండటమేనని వారు వివరించారు.
ఈ పాదయాత్రలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దక్షిణాదిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, అలాగే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ యాత్ర వేదికగా మారుతుందని కమల నాథులు భావిస్తున్నారు.
పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు బషీర్బాగ్, అబిడ్స్, లిబర్టీ, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు. మొత్తానికి అమిత్ షా పర్యటనతో హైదరాబాద్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.








