ట్రంప్ కొత్త ఎత్తుగడ..ఓట్ల లెక్కింపును అడ్డుకునేందుకు భారీ ప్లాన్!!?
అమెరికాలో ఎన్నికలు మొదలే అవ్వలేదు. కానీ రిజల్ట్ తర్వాత జరిగే పొలిటికల్ గేమ్ మాత్రం అప్పుడే పీక్స్‌కు చేరింది! ఓటర్లు తమ తీర్పు చెప్పకముందే ఓట్లపై వివాదాలు, ఎన్నికల అధికారులపై ఒత్తిళ్లు, కోర్టుల్లో కేసులు.. ఇవన్నీ మొదలైపోయాయి.దీంతో అనేక ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. ట్రంప్‌కు ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? దాంతో ఫలితాలు వెలువడిన వెంటనే రాజకీయ పోరాటం మొదలెట్టేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారా? అసలు ఎన్నికల రోజుకు ముందే ట్రంప్ ప్రభుత్వం ఇన్ని వివాదాలకు తెరతీయడం వెనుక కథేంటి? అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల చుట్టూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.అదేంటో చూద్దాం.
ఎక్కడైనా ఎన్నికలంటే కేవలం ఓటింగ్ రోజు జరిగే హడావుడి మాత్రమే కాదు. ఓటర్ల జాబితా నుంచి బ్యాలెట్ల లెక్కింపు వరకు, ఫలితాల ధ్రువీకరణ నుంచి కోర్టు వివాదాల వరకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా రొటీన్ గా జరిగేదే. అయితే ఈసారి ఆ ప్రాసెస్‌లోని కీలక అంశాలపై ట్రంప్ ప్రభుత్వం ముందుగానే కోర్టుల ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వం మాత్రం ఇదంతా ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికేనని చెబుతోంది. కానీ విమర్శకుల ప్రశ్న వేరేలా ఉంది. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి చుట్టూ ఇన్ని వివాదాలు సృష్టించడం ఎందుకు? దానికి వేరే రీజన్ ఉందా అని.
కాలిఫోర్నియాలో 20 వేల ఓట్లపై కన్ను!
ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా హైలైట్ అవుతున్నది కాలిఫోర్నియా. అక్కడ 20 వేలకు పైగా బ్యాలెట్లను పక్కన పెట్టాలని అమెరికా న్యాయశాఖ కోర్టును ఆశ్రయించింది. ఆ ఓట్లు అమెరికా పౌరసత్వం లేని వ్యక్తులకు సంబంధించినవి కావచ్చన్నది ప్రభుత్వం వాదన. అంటే, ఈ బ్యాలెట్లను లెక్కించాలా వద్దా అన్నదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.
ఇవి కూడా చదవండి
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఆరోపిస్తున్నంతమాత్రాన ఆ ఓట్లన్నీ అక్రమమైనవని తేలిపోదు. అర్హులైన ఓటర్ల ఓట్లను కూడా పక్కన పెట్టే ప్రమాదం ఉందని కోర్టులు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్టోబర్ 30న అమెరికా అప్పీళ్ల కోర్టు కూడా ఈ బ్యాలెట్లను పక్కన పెట్టాలన్న న్యాయశాఖ అభ్యర్థనను తిరస్కరించింది. అయినా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదు. అప్పీల్‌కు వెళ్లింది.
అలాస్కాలో మరో ట్విస్ట్.. పేర్ల గందరగోళమే అసలు కథ!
ఇంకో ఆసక్తికరమైన వివాదం అలాస్కాలో మొదలైంది. అక్కడ సెనేట్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డాన్ సుల్లివన్‌తో పాటు డేనియల్ జె. సుల్లివన్ జూనియర్ అనే మరో అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లలోనూ సుల్లివన్ ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం వాదించింది.
ఈ కారణంతో డెమొక్రటిక్ అభ్యర్థి మేరీ పెల్టోలా గెలిస్తే ఫలితాల ధ్రువీకరణను నిలిపివేయాలని కోర్టును కోరింది. అంటే, ఓటర్లు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? పొరపాటున మరో అభ్యర్థికి ఓటేశారా? అన్న అంశాలను పరిశీలించకుండా ఫలితాన్ని అధికారికంగా ఖరారు చేయకూడదన్నది ప్రభుత్వ వాదనలోని ప్రధాన అంశం.
కానీ నవంబర్ 1న అలాస్కా ఫెడరల్ జడ్జి ఈ పిటిషన్‌ను కొట్టేశారు. ఎన్నికల నిర్వహణపై ఫెడరల్ ప్రభుత్వానికి ఇలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని, ప్రతిపాదించిన విధానం ఓటర్ల రహస్య ఓటు హక్కుకూ సమస్యగా మారవచ్చని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై కూడా న్యాయశాఖ అప్పీల్ చేస్తామని ప్రకటించింది.
ఓట్ల జాబితాల నుంచి ఎన్నికల అధికారుల దాకా..
ఇది కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన వ్యవహారం కాదు. అమెరికాలోని పలు రాష్ట్రాల ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివరాలను కూడా ట్రంప్ ప్రభుత్వం కోరింది. దాదాపు 30 రాష్ట్రాల్లో ఓటర్ల సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఓటర్ల జాబితాల్లో అర్హత లేని వ్యక్తులు ఉన్నారా? పౌరసత్వం లేని వారు ఓటర్లుగా నమోదయ్యారా? అన్నది పరిశీలించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు కాలిఫోర్నియాలో ఎన్నికల అధికారులకు నోటీసులు, సమన్లు పంపడం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రికార్డులను కోరడం వంటి చర్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు వారి స్వతంత్రతను ప్రభావితం చేయవచ్చని విమర్శకులు అంటున్నారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా అవకతవక జరిగితే దర్యాప్తు చేయడం తప్పు కాదు. కానీ అనుమానాల ఆధారంగా ఎన్నికల అధికారులపై ఒత్తిడి పెంచితే, దాని ప్రభావం ఓటర్లలోనూ కనిపిస్తుందన్నది వారి ఆందోళన.
అసలు ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు?
ఇక్కడే అసలు రాజకీయ లెక్కలను అర్థం చేసుకోవాలి. ఈసారి అమెరికాలో జరుగుతున్నవి మిడ్‌టర్మ్ ఎన్నికలు. అంటే అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికలు కావు. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్ స్థానాల కోసం జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్ రాజకీయాలకు కీలకం. కాంగ్రెస్‌లో మెజారిటీ మారితే ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పర్యవేక్షణ, విచారణలు, చట్టాల ఆమోదం వంటి అంశాల్లో పరిస్థితులు మారవచ్చు.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల అర్హతలు, బ్యాలెట్ల లెక్కింపు వంటి అంశాలపై ముందుగానే న్యాయపోరాటం మొదలుపెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విమర్శకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైనా తేడా కనిపిస్తే దాన్ని సవాలు చేయడానికి అవసరమైన న్యాయపరమైన మార్గాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారన్నది వారి అనుమానం.
అయితే ట్రంప్‌కు ఓటమి భయం ఉందని ఈ చర్యల చూస్తున్న చాలా మంది అంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌ను అరికట్టడం, ఓటర్ల జాబితాలను శుభ్రపరచడం, ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని కాపాడటమే తమ లక్ష్యమని చెబుతోంది. మరోవైపు విమర్శకులు మాత్రం ఈ చర్యలు ఎన్నికల ఫలితాలపై ముందుగానే అనుమానాలు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో ఎన్నికలు ఎవరి చేతుల్లో ఉంటాయి?
ఈ వివాదంలో మరో కీలకమైన అంశం ఉంది. అమెరికాలో ఎన్నికలను నిర్వహించే ప్రధాన బాధ్యత రాష్ట్రాలదే. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, ఫలితాల ధ్రువీకరణ వంటి పనులను రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు నిర్వహిస్తారు. ఫెడరల్ ప్రభుత్వం కొన్ని ఎన్నికల చట్టాలను అమలు చేయగలదు. కానీ రాష్ట్రాల ఎన్నికల నిర్వహణను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడం అంత సులభం కాదు.
అందుకే ట్రంప్ ప్రభుత్వం రాష్ట్రాల ఎన్నికల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. కోర్టులు కూడా ఇప్పటివరకు కొన్ని కీలక ప్రయత్నాలను అడ్డుకున్నాయి. కాలిఫోర్నియా బ్యాలెట్ల వివాదం, అలాస్కా ఫలితాల ధ్రువీకరణ కేసు అందుకు ఉదాహరణలు. అంటే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న ప్రతి వాదనకు కోర్టుల్లో ఆమోదం లభించడం లేదు.
అసలు గేమ్ ఎన్నికల రోజుతో ముగుస్తుందా?
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఒక లెక్క. ఆ ఫలితాన్ని అన్ని వర్గాలు అంగీకరించి, అధికారికంగా ధ్రువీకరించే వరకు జరిగే ప్రక్రియ మరో లెక్క. ఈ రెండింటి మధ్యే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో అసలు టెన్షన్ కనిపిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు నిజంగా ఎన్నికల భద్రతను పెంచుతాయా? లేక ఎన్నికల తర్వాత కూడా కేసులు, దర్యాప్తులు, న్యాయపోరాటాలు కొనసాగేందుకు దారి తీస్తాయా? అన్నది రాబోయే పరిణామాలే తేల్చాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








