అమెరికా ఎన్నికల్లోకి ఎలాన్ మస్క్ డబ్బు వరద.. ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!
అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడి రాజకీయ నాయకులే కాదు.. ప్రపంచ కుబేరులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఈసారి ఒక వ్యక్తి చేస్తున్న ఖర్చు చూస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా మధ్యంతర ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బును మస్క్ ఏ ఒక్క అభ్యర్థికో ఇవ్వడం లేదు. రిపబ్లికన్లకు మద్దతుగా పనిచేసే రాజకీయ సంస్థలు, ప్రచార కమిటీల ద్వారా అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపేందుకు ఉపయోగిస్తున్నారు. మరి ఒక టెక్ బిలియనీర్‌కు ఎన్నికలపై ఇంత ఆసక్తి ఎందుకు? ఈ డబ్బుతో అమెరికా రాజకీయాల్లో ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు?
ఒక్క ఎన్నికల కోసం అన్ని కోట్లా… ఇదేం రేంజ్ బాస్!
ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన ఎలాన్ మస్క్ రాజకీయాలకు పెట్టే ఖర్చు ఇప్పుడు కొత్త రికార్డు సృష్టిస్తోంది. అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (FEC) వద్ద అక్టోబర్ 29 వరకు నమోదైన వివరాల ప్రకారం, గత ఏడాది నుంచి ఆయన రిపబ్లికన్లకు అనుకూలంగా పనిచేసే పొలిటికల్ యాక్షన్ కమిటీలు (PACs), ఇతర రాజకీయ సంస్థలకు కనీసం 445.77 మిలియన్ డాలర్లు అందించారు. నవంబర్ 1 నాటి డాలర్ మారకం విలువ ప్రకారం ఇది సుమారు రూ.4,240 కోట్లు.
అమెరికా ఆధునిక రాజకీయ చరిత్రలో ఒకే ఎన్నికల చక్రంలో ఒక వ్యక్తి ఇచ్చిన అతిపెద్ద రాజకీయ విరాళంగా ఇది నిలిచిందని గార్డియన్ కథనం పేర్కొంది. అంటే ఎన్నికల ప్రచారంలో డబ్బు ఖర్చు చేసే విషయంలో మస్క్ కొత్త స్థాయిని సృష్టించారు. ఈ మొత్తంతో ఆరు SpaceX రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చును భరించవచ్చని, లాస్ ఏంజెలెస్‌లోని టెస్లా డైనర్లో 3.19 కోట్లకు పైగా చీజ్బర్గర్లు కొనవచ్చని గార్డియన్ ఆసక్తికరమైన పోలిక ఇచ్చింది.
గత ఏడాది తగ్గిస్తానన్నారు.. ఇప్పుడు ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా!
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా మస్క్ దాదాపు 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. భారత కరెన్సీలో అది సుమారు రూ.2,853 కోట్లు. ఆ సమయంలో ట్రంప్ ప్రచార ర్యాలీల్లో పాల్గొని, ఆయన పక్కనే వేదికపై కనిపించారు. ఎన్నికల తర్వాత మాత్రం భారీ స్థాయిలో రాజకీయ విరాళాలు ఇవ్వడం తగ్గిస్తానని సంకేతాలిచ్చారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రెండు నెలల్లోనే ఆయన విరాళాలు సుమారు 200 మిలియన్ డాలర్లు పెరిగాయి. అంటే దాదాపు రూ.1,902 కోట్లు అదనంగా రాజకీయ ప్రచారంలోకి వెళ్లినట్టే. గత ఏడాది తగ్గిస్తానన్న వ్యక్తే ఇప్పుడు ఇంత భారీగా డబ్బు ఖర్చు చేయడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సొంత రాజకీయ సంస్థకే రూ.2,054 కోట్లు!
మస్క్ ఇచ్చిన మొత్తం డబ్బులో అత్యధిక భాగం ఆయన సొంతంగా ఏర్పాటు చేసిన America PACకు వెళ్లింది. ఈ సంస్థకు ఆయన 216 మిలియన్ డాలర్లు అందించారు. భారత కరెన్సీలో దాదాపు రూ.2,054 కోట్లు!
ఈ America PAC లక్ష్యం 43 హౌస్, సెనేట్ ఎన్నికల పోటీల్లో రిపబ్లికన్లకు మద్దతుగా పనిచేయడం. ఇందుకోసం టెలివిజన్ ప్రకటనలు, డిజిటల్ యాడ్స్, ఫోన్ మెసేజ్‌లు, ఓటర్ల ఇళ్లకు పంపే ప్రచార లేఖలు వంటి మార్గాలను ఉపయోగిస్తోంది. అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని కేవలం సభలతోనే కాకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్రకటనలు, ఓటర్లకు నేరుగా చేరే ప్రచారంతో కూడా నడిపిస్తున్నారన్నమాట.
ఇక్కడ PAC అంటే ఏమిటో తెలుసుకోవాలి. Political Action Committee అనేది ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి లేదా ప్రత్యర్థులను వ్యతిరేకించడానికి నిధులు సేకరించి ఖర్చు చేసే రాజకీయ సంస్థ. ముఖ్యంగా Super PACలకు భారీ మొత్తంలో విరాళాలు స్వీకరించి, అభ్యర్థులకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా స్వతంత్ర ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అయితే అభ్యర్థుల అధికారిక ప్రచార బృందాలతో కలిసి ఖర్చు చేయకూడదనే నిబంధన ఉంటుంది.
టెక్సాస్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూ.1,598 కోట్లు!
మస్క్ డబ్బు ఎక్కువగా ప్రవహిస్తున్న రాష్ట్రాల్లో ఆయన సొంత రాష్ట్రం టెక్సాస్ ఒకటి. అక్కడ డెమొక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో, రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్ మధ్య సెనేట్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఎన్నికలు 2026 మధ్యంతర ఎన్నికల్లో అత్యంత ఖరీదైన పోటీల్లో ఒకటిగా మారాయి.
కెన్ పాక్స్టన్కు మద్దతుగా మస్క్‌కు చెందిన America PAC ఇప్పటికే 33 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అంటే సుమారు రూ.314 కోట్లు. అంతేకాదు, పాక్స్టన్కు మద్దతు ఇచ్చే Senate Leadership Fundకు మస్క్ మరో 168 మిలియన్ డాలర్లు అందించారు. భారత కరెన్సీలో దాదాపు రూ.1,598 కోట్లు. ఒక రాష్ట్రంలోని ఎన్నికల పోరాటానికి మాత్రమే ఇంత భారీ ఆర్థిక మద్దతు అందడం అమెరికా రాజకీయాల్లో డబ్బు ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
ప్రత్యర్థులపై ఒక్క ప్రకటనకే రూ.3 కోట్లకు పైగా!
మస్క్‌కు చెందిన PACలు కేవలం రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం మాత్రమే కాదు. డెమొక్రటిక్ అభ్యర్థులపై విమర్శనాత్మక ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా జేమ్స్ తలారికోను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ప్రకటనల కోసం America PAC సుమారు 28 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అంటే దాదాపు రూ.266 కోట్లు.
అందులో ఒక గూగుల్ ప్రకటన కోసం అక్టోబర్‌లోనే 3 లక్షల నుంచి 3.5 లక్షల డాలర్ల వరకు ఖర్చు చేశారు. రూపాయిల్లో చెప్పాలంటే సుమారు రూ.2.85 కోట్ల నుంచి రూ.3.33 కోట్ల వరకు! ఆ ప్రకటనను కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే కోటి మందికి పైగా చూశారని కథనం పేర్కొంది.
ఈ ప్రకటనల్లో తలారికో విధానాలను విమర్శిస్తూ, ముఖ్యంగా పిల్లల లింగ మార్పిడి అంశాన్ని ప్రస్తావించారు. మస్క్ కూడా తన X ఖాతా ద్వారా ఈ ప్రచారాన్ని మరింత విస్తరించారు. ఆయనకు అక్కడ 20 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉండటంతో, ఒక పోస్ట్ ద్వారా కూడా భారీ సంఖ్యలో ప్రజలకు సందేశం చేరే అవకాశం ఉంది. అంటే ఇక్కడ డబ్బు మాత్రమే కాదు.. సోషల్ మీడియా ప్రభావం కూడా రాజకీయ ప్రచారంలో కీలకంగా మారుతోంది.
సోరోస్, బ్లూమ్‌బర్గ్ లాంటి కుబేరులనూ దాటేశారు!
అమెరికా రాజకీయాలకు బిలియనీర్లు విరాళాలు ఇవ్వడం కొత్త విషయం కాదు. జార్జ్ సోరోస్, మైఖేల్ బ్లూమ్‌బర్గ్ వంటి సంపన్నులు గతంలోనూ భారీ మొత్తంలో రాజకీయ విరాళాలు అందించారు. సిలికాన్ వ్యాలీకి చెందిన మార్క్ ఆండ్రీసెన్ వంటి టెక్ రంగ ప్రముఖులు కూడా రాజకీయ సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారు.
అయితే ఈసారి మస్క్ ఖర్చు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో టాప్ సిలికాన్ వ్యాలీ దాతలందరూ కలిపి ఖర్చు చేసిన మొత్తాన్ని కూడా ఈ ఎన్నికల చక్రంలో మస్క్ ఒక్కరే ఇచ్చిన విరాళాలు అధిగమించాయని గార్డియన్ విశ్లేషణ చెబుతోంది. దీంతో అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక మద్దతుదారుల్లో ఆయన స్థానం మరింత బలపడింది.
ట్రంప్ ప్రభుత్వంతో మస్క్‌కు ఉన్న సంబంధం.. అసలు ఆసక్తి అక్కడేనా?
మస్క్ ఇంత భారీగా రిపబ్లికన్లకు మద్దతు ఇవ్వడం వెనుక రాజకీయ లెక్కలతో పాటు వ్యాపార ప్రయోజనాల అంశం కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే టెస్లా, స్పేస్ఎక్స్ వంటి సంస్థల భవిష్యత్తు అమెరికా ప్రభుత్వ విధానాలు, నియంత్రణలతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా AI రంగంపై ఎలాంటి నిబంధనలు తీసుకురావాలి? టెక్నాలజీ కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత ఉండాలి? అంతరిక్ష, రక్షణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలా ఇవ్వాలి? వంటి అంశాలు మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి కీలకం.
ట్రంప్ ప్రభుత్వంతో మస్క్‌కు ఉన్న అనుబంధం కూడా ఈ నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. స్పేస్ఎక్స్ ఈ ఏడాది ట్రంప్ ప్రభుత్వ క్షిపణి రక్షణ కార్యక్రమానికి సంబంధించిన భారీ కాంట్రాక్టులను పొందింది. మస్క్‌కు చెందిన Grok AI చాట్‌బాట్‌ను పెంటగాన్‌లో ఉపయోగించే అంశం కూడా ప్రభుత్వంతో ఆయన వ్యాపార సంబంధాలు ఎంతగా ముడిపడ్డాయో చూపిస్తోంది.
అయితే ఈ విరాళాల వెనుక వ్యాపార ప్రయోజనాలే ఏకైక కారణమని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ ప్రభుత్వ విధానాలు తన సంస్థలపై చూపే ప్రభావం, ట్రంప్‌తో ఉన్న రాజకీయ సంబంధం రెండూ ఈ భారీ విరాళాల చర్చలో కీలకంగా మారుతున్నాయి.
ఇంత డబ్బు ఖర్చు చేసినా మస్క్ సంపదలో అది చాలా చిన్న భాగమే!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికా ఎన్నికల్లో రూ.4,240 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న మస్క్‌కు ఈ మొత్తం ఆయన మొత్తం సంపదతో పోలిస్తే చాలా చిన్న భాగం మాత్రమే. గార్డియన్ కథనం ప్రకారం ఆయన సంపద సుమారు 924 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. దాంతో ఎన్నికల కోసం ఇచ్చిన విరాళాలు ఆయన మొత్తం సంపదలో 0.05 శాతం కంటే కూడా తక్కువ.
అంటే సాధారణ వ్యక్తికి వేల రూపాయల ఖర్చు కూడా పెద్ద విషయమైతే, ప్రపంచ కుబేరుడికి వేల కోట్ల రాజకీయ విరాళాలు కూడా మొత్తం సంపదలో చిన్న భాగమే. కానీ ఆ చిన్న భాగంతో అమెరికా ఎన్నికల ప్రచారంలో ఎంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపించగలరో ఈ వ్యవహారం మరోసారి చర్చకు తెచ్చింది.
అమెరికాలో ఓటు హక్కు ప్రతి పౌరుడికీ ఒక్కటే. కానీ ఎన్నికల ప్రచారానికి వచ్చే డబ్బు మాత్రం అందరికీ సమానంగా ఉండదు. ఒకవైపు సాధారణ ఓటరు తన సమస్యల ఆధారంగా అభ్యర్థిని ఎంచుకుంటుంటే, మరోవైపు బిలియనీర్లు కోట్ల డాలర్లతో ప్రచార వాతావరణాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారు. అందుకే ఇప్పుడు అమెరికాలో చర్చ కేవలం ఎవరు గెలుస్తారనే దాని గురించే కాదు.. ఎన్నికల్లో డబ్బు, టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉండాలనే దాని గురించి కూడా!
— సూర్య ప్రకాష్ జోశ్యుల








