20 వేల నల్లులకు రోజూ రక్తదానం.. ఐదేళ్లుగా వాటితోనే నిద్రపోతున్న వ్యక్తి!
నల్లులు కనిపిస్తే చాలు.. ఆ రోజు మనకు నిద్ర ఉండదు! బెడ్ మొత్తం వెతికి, బెడ్షీట్లు మార్చి, చివరికి నల్లుల మందు కొట్టి కానీ వదిలిపెట్టం. కానీ బ్రిటన్‌లో ఓ వ్యక్తి మాత్రం వీటన్నింటికీ పూర్తి ఆపోజిట్. నల్లులను చంపడం కాదు కదా.. వాటికి తన రక్తాన్నే ఆఫర్ చేస్తున్నాడు! ఒకటి రెండు కాదు.. ఏకంగా 20 వేల నల్లులు అతడి చేతిపై పార్టీ చేసుకుంటున్నాయి. పైగా ఐదేళ్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. వినడానికి ఏదో క్రేజీ హారర్ మూవీలా ఉంది కదా? కానీ ఇది రీల్ కాదు.. రియల్ స్టోరీ. ఇంతకీ ఇతడికి ఏమైంది? నల్లులతో ఈ విచిత్రమైన బంధం వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి?
60 వేల నల్లులు.. ఇంట్లోనే ప్రత్యేక సామ్రాజ్యం!
బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ రిచర్డ్ నేలర్ను చూస్తే మొదట ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన దగ్గర ఏకంగా 50 వేల నుంచి 60 వేల బెడ్‌బగ్స్ ఉన్నాయి. వాటిని పెంచడానికి ఇంటి వెనుక తోటలోనే రెండు బెడ్రూమ్లతో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు.
వృత్తిరీత్యా ఆయన ఎంటమాలజిస్ట్. అంటే కీటకాలపై పరిశోధనలు చేస్తుంటారు. అయితే చాలామంది శాస్త్రవేత్తలు సూక్ష్మదర్శినులు, ప్రయోగ పరికరాలతో బిజీగా ఉంటే.. ఈయన మాత్రం వేలాది నల్లుల మధ్యే తన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వాటికి ఆహారం పెట్టడం కూడా ఆయనే చేస్తారు. ఇక్కడ ఆహారం అంటే మరేదో కాదు.. తన రక్తమే!
ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి సుమారు 20 వేల నల్లులకు రక్తం అందిస్తారు. ఇందుకోసం చిన్న చిన్న గాజు పాత్రల్లో నల్లులను ఉంచి, వాటిని ఎలాస్టిక్ బ్యాండ్లతో తన చేతికి కట్టుకుంటారు. అవి రక్తం పీల్చుకుంటుంటే ఆయన మాత్రం కంప్యూటర్ ముందు కూర్చొని తన పని తాను చేసుకుంటారు. ఈ సీన్ చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించాల్సిందే!
లక్షలసార్లు కుట్టినా ఇప్పుడు ఆయనకు దురద కూడా లేదట!
మనల్ని ఒక్క నల్లి కుడితేనే ఆ ప్రాంతం ఎర్రగా మారి, దురదతో పిచ్చెక్కిపోతుంది. అలాంటిది వేలాది నల్లులు ఒకేసారి రక్తం పీల్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ రిచర్డ్ మాత్రం ఈ విషయంలో చాలా కూల్‌గా ఉన్నారు.
ఇప్పటివరకు తనను లక్షలాది సార్లు నల్లులు కుట్టి ఉంటాయని ఆయన చెబుతున్నారు. మొదట్లో వాటి కాట్లకు తన శరీరం కూడా స్పందించేదట. కానీ కాలక్రమంలో ఆ ప్రతిచర్య తగ్గిపోయింది. ఇప్పుడు నల్లులు రక్తం తాగిన తర్వాత చేతిపై చిన్న ఎర్రటి మచ్చ ఏర్పడుతుందని, అది కూడా అరగంటలో మాయమవుతుందని వివరించారు.
అంటే మనం నల్లుల కాట్లకు భయపడి బెడ్ మార్చుకుంటుంటే.. ఆయన మాత్రం వాటి మధ్యే ప్రశాంతంగా పని చేసుకుంటున్నారన్నమాట!
నల్లులతో బెడ్ షేర్ చేసుకోవడం వెనుక అసలు సీక్రెట్!
ఇంతకీ రిచర్డ్‌కు నల్లులంటే అంత ఇష్టమా? వాటితోనే ఎందుకు నిద్రపోతున్నారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ఆయన చేస్తున్నది సరదా ప్రయోగం కాదు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న నల్లుల నివారణ ఉత్పత్తులు నిజంగా పనిచేస్తున్నాయా లేదా అని పరీక్షించడం ఆయన బాధ్యత. కొత్తగా మార్కెట్లోకి వచ్చే స్ప్రేలు, రిపెల్లెంట్లు, నల్లులను అడ్డుకునే పరికరాల పనితీరును తెలుసుకోవాలంటే వాటిని నేరుగా పరీక్షించాలి. అందుకోసం నల్లులు చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం.
కానీ బెడ్రూమ్లో మనిషి లేకపోతే నల్లులు పెద్దగా కదలవట. అవి ఒకచోటే ఉండిపోతాయి. మనిషి నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్, శరీర వేడి వంటి సంకేతాలు అందినప్పుడే ఆహారం కోసం బయటకు వస్తాయి. అందుకే ప్రయోగాల సమయంలో రిచర్డ్ స్వయంగా ఆ గదిలో నిద్రిస్తారు. నల్లులు బయటకు వచ్చి కుడుతున్నప్పుడే కొత్త ఉత్పత్తులు వాటిని అడ్డుకుంటున్నాయా లేదా అనేది పరీక్షించగలుగుతారు.
మనకు బెడ్రూమ్ అంటే ప్రశాంతంగా నిద్రపోయే ప్లేస్. కానీ ఆయన ల్యాబ్‌లో మాత్రం అదే బెడ్రూమ్ ఒక టెస్టింగ్ జోన్!
మందులు కొట్టినా నల్లులు చావడం లేదా?
నల్లుల సమస్యను చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ ఈ చిన్న పురుగులు ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ రంగానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఎందుకంటే కొన్ని బెడ్‌బగ్స్ ఆధునిక పురుగుల మందులను కూడా తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి.
దీంతో సాధారణంగా ఉపయోగించే స్ప్రేలతో వాటిని పూర్తిగా నిర్మూలించడం కష్టమవుతోంది. ఒకసారి ఇంట్లోకి వచ్చాయంటే వాటిని గుర్తించడం, దాక్కున్న ప్రాంతాలను కనిపెట్టడం, పూర్తిగా తొలగించడం పెద్ద తలనొప్పిగా మారుతుంది.
రిచర్డ్ నిర్వహిస్తున్న ‘బెడ్ బగ్ ఫౌండేషన్’ ఒక లాభాపేక్షలేని సంస్థ. ఆయన ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు నల్లులను పంపిస్తుంటారు. ముఖ్యంగా హోటళ్లలో నల్లుల ఉనికిని గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్కల బృందాలు వీటిని ఉపయోగిస్తాయి. అంతేకాదు.. వ్యాపార సంస్థలు తమ పెస్ట్ కంట్రోల్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురాకముందే పరీక్షించుకునేందుకు కూడా ఆయన సహాయం చేస్తుంటారు.
నల్లుల సమస్య అంటే కేవలం దురద మాత్రమే కాదు!
నల్లులు కుడితే వచ్చే దురద ఒక ఎత్తయితే.. ఇంట్లో అవి ఉన్నాయనే ఆలోచన మరో ఎత్తు. ముఖ్యంగా హోటళ్లలో లేదా ఇళ్లలో నల్లుల సమస్య ఎదుర్కొన్నవాళ్లకు ఆ అనుభవం ఎంత చిరాకుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సమస్య వల్ల కొందరు తీవ్ర భావోద్వేగ, మానసిక ఒత్తిడికి గురవుతారని రిచర్డ్ చెబుతున్నారు. మరికొందరిలో దీర్ఘకాలం పాటు PTSD తరహా లక్షణాలు కూడా కనిపించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే నల్లులు కనిపించకపోయినా.. అవి మళ్లీ కుడతాయేమోననే భయం వెంటాడుతుంటుంది.
అందుకే ఇంట్లో నల్లులు ఉన్నాయని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా ఏవేవో ప్రయోగాలు చేయకుండా పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మొత్తానికి.. మనం నల్లులను చూస్తేనే పారిపోతాం. కానీ ఈయన మాత్రం వాటికి తన రక్తాన్ని విందుగా పెట్టి, వాటితోనే నిద్రపోతున్నారు. మనకు అవి పీడకలలు.. ఆయనకు మాత్రం అవే పరిశోధనలో పార్ట్నర్లు! సైన్స్ కోసం మనిషి ఎంతవరకు వెళ్లగలడో చెప్పడానికి ఈ స్టోరీ ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








