ఆన్లైన్లో చేతబడులు.. ఇదో కొత్త ట్రెండ్! Ex-Lover నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వరకు.. ఒక్క క్లిక్‌తో నే!
ఒకప్పుడు చేతబడి చేయించుకోవాలంటే అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లాలి.. నిమ్మకాయలు, కోళ్లు, బొమ్మలు అంటూ పెద్ద తతంగమే ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శ్మశానాలకు వెళ్లాల్సిన పని లేదు. అర్ధరాత్రి ఎవరినీ కలవాల్సిన అవసరం అసలే లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుందట! మీ మాజీ ప్రియుడు తిరిగి రావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, డబ్బు కుప్పలుగా వచ్చిపడాలన్నా.. అన్నింటికీ స్పెషల్ మంత్రాలు అందుబాటులో ఉన్నాయి. చివరికి పెళ్లి రోజు వర్షం పడకుండా చేసే మంత్రం కూడా ఉందట. ఇదేదో కొత్త ఈ-కామర్స్ కేటగిరీలా అనిపిస్తోంది కదా! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ డిజిటల్ చేతబడుల మార్కెట్లో కస్టమర్లుగా మారుతున్నది ఎక్కువగా యువతే. లాజిక్, సైన్స్, AI అంటూ ప్రపంచాన్ని ప్రశ్నించే Gen Z.. ఇప్పుడు ఆన్లైన్ మంత్రగత్తెల దగ్గర అదృష్టం కోసం డబ్బులు ఖర్చు చేస్తోంది!
బ్రేకప్ అయిందా? Ex తిరిగి రావాలా? స్పెషల్ స్పెల్ ఉంది!
ఇప్పటివరకు ఆన్లైన్లో షాపింగ్ అంటే బట్టలు, ఫోన్లు, గాడ్జెట్లు గుర్తొచ్చేవి. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రాలు కూడా చేరాయి. Etsy వంటి ఆన్లైన్ మార్కెట్ప్లేస్లలోకి వెళ్తే ప్రేమ, డబ్బు, అదృష్టం, కెరీర్.. ఇలా రకరకాల కోరికలకు రకరకాల స్పెల్స్ కనిపిస్తాయి. మీకు ఏం కావాలో ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే చాలు. సంబంధిత మంత్రగత్తె మీకు సేవలు అందిస్తుంది.
స్కాట్లాండ్కు చెందిన 24 ఏళ్ల ఎల్లెసియా కాహిల్ (Ellecia Cahill) ఈ రంగంలో ఉన్నవారిలో ఒకరు. తనను తాను మిస్టిక్‌గా పరిచయం చేసుకునే ఆమెకు Etsyలో ఇప్పటికే 2,000కు పైగా అమ్మకాలు జరిగాయి. స్పిరిచువల్ రీడింగ్స్, క్రిస్టల్స్, తాయెత్తులు, మరణించిన ఆత్మీయుల నుంచి సందేశాలు అందిస్తామనే చానెల్డ్ లెటర్స్.. ఇలా రకరకాల సేవలు అందిస్తున్నారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. కస్టమర్లు ఎక్కువగా అడుగుతున్నది ప్రేమ మంత్రాలు కాదట. డబ్బు, సంపద, విజయాలు, అవకాశాలు ఆకర్షించే అబండెన్స్ స్పెల్స్‌కు మంచి డిమాండ్ ఉందని ఆమె చెబుతున్నారు. అంటే ఒకప్పుడు ఉద్యోగం కోసం రెజ్యూమ్ పంపేవారు. ఇప్పుడు కొందరు రెజ్యూమ్‌తో పాటు మంత్రం కూడా పంపిస్తున్నారన్నమాట!
ఇవి కూడా చదవండి
బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలా? తాయెత్తు కొనుక్కోండి!
ఎల్లెసియా చెప్పిన మరో విషయం మరింత ఆసక్తికరంగా ఉంది. మొనాకోకు చెందిన ఓ టెక్ ఇన్వెస్టర్ తన దగ్గర అబండెన్స్ తాయెత్తు కొనుగోలు చేశాడట. ఆ తర్వాత అతడి సంపద గణనీయంగా పెరిగిందని ఆమె చెబుతున్నారు. అయితే ఆర్థిక వృద్ధికి తాయెత్తే కారణమని నిరూపించే ఆధారాలేమీ లేవు.
ఏదేమైనా, ఈ మార్కెట్లో ఆఫర్లకు కొదవ లేదు. పెళ్లి రోజు వర్షం పడకూడదా? దానికో స్పెల్ ఉంది. టికెట్లు దొరకని కాన్సర్ట్‌కు వెళ్లాలా? అందుకు మరో స్పెల్ ఉంది. రేపు బాస్ మీటింగ్‌లో మీపై కోపం చూపించకూడదా? అలాంటి కోరికలకు కూడా ఏదో ఒక మంత్రం దొరుకుతుందేమో అనిపిస్తుంది!
Etsy వెల్లడించిన వివరాల ప్రకారం, పెళ్లి రోజున ఎండగా ఉండేలా చేసే స్పెల్స్ కోసం సెర్చ్‌లు ఏకంగా 206 శాతం పెరిగాయి. పెళ్లికి సంబంధించిన మంత్రాలు, మంత్రగత్తెల కోసం సాధారణ సెర్చ్‌లు 105 శాతం పెరిగాయి. అంటే వెడ్డింగ్ ప్లానింగ్‌లో ఇప్పుడు ఫోటోగ్రాఫర్, డెకరేటర్, క్యాటరర్‌తో పాటు మంత్రగత్తెకు కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారన్నమాట!
అయితే ఈ స్పెల్స్ నిజంగా పనిచేస్తాయని Etsy కూడా హామీ ఇవ్వడం లేదు. ఆ ప్లాట్‌ఫామ్ నిబంధనల ప్రకారం వీటిని వినోద ప్రయోజనాల కోసమే మార్కెట్ చేయాలి.
ఉద్యోగం కోసం మంత్రం వేయించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే!
గ్లాస్గోకు చెందిన నటి లారా బ్లెయిర్ (29) తన కెరీర్ కోసం ఓ జాబ్ స్పెల్ కొనుగోలు చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఆమెకు ఓ మంత్రగత్తెను కేటాయించారు. తన పూర్తి పేరు, మరికొన్ని వ్యక్తిగత వివరాలు పంపించాల్సి వచ్చింది. ఆ తర్వాత సదరు మంత్రగత్తె తాను స్పెల్ చేస్తున్న వీడియోను పంపించింది.
ఆమె కోరుకున్న ఉద్యోగం సరిగ్గా రాకపోయినా, తర్వాత తన నటనా కెరీర్లో వరుస అవకాశాలు వచ్చాయని లారా చెబుతున్నారు. తన కెరీర్లో ఎప్పుడూ లేనంత బిజీగా మారానని అంటున్నారు.
ఇంకో కస్టమర్ క్లోయ్ (22) కథ మాత్రం కొంచెం రివర్స్. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు మాజీ ప్రియుడు తిరిగి రావాలని స్పెల్ కొనుగోలు చేసింది. కానీ ఎక్స్ తిరిగి రాలేదు. డబ్బులు తిరిగి రాలేదు! చివరకు ఇది టైమ్, మనీ వేస్ట్ అని తేల్చేసింది. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అతడు రాకపోవడమే మంచిదైందని నవ్వుకుంటోంది.
నిజానికి ఈ కథలో అసలు కామెడీ ఏమిటంటే.. బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడికి మెసేజ్ చేయకూడదని ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినని కొందరు.. ఇప్పుడు అతడిని తిరిగి రప్పించడానికి మంత్రగత్తెలకు డబ్బులు చెల్లిస్తున్నారు!
సైన్స్ చదివిన Gen Z.. మంత్రాల వైపు ఎందుకు చూస్తోంది?
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. టెక్నాలజీని నమ్మే యువత మంత్రాల వైపు ఎందుకు వెళ్తోంది? AIతో ఫొటోలు తయారు చేసే, చాట్బాట్లతో మాట్లాడే, ప్రతి విషయాన్నీ గూగుల్‌లో వెతికే జనరేషన్‌కు చేతబడి మీద ఆసక్తి ఎందుకు?
లీడ్స్ బెకెట్ యూనివర్సిటీకి చెందిన మత సామాజిక శాస్త్ర పరిశోధకురాలు అలెగ్జాండ్రియా ఆర్థర్-హాస్టీ (Alexandria Arthur-Hastie) దీనికి ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. సంప్రదాయ మత విశ్వాసాల నుంచి కొందరు వ్యక్తిగత ఆధ్యాత్మికత వైపు మళ్లుతున్నారని ఆమె చెబుతున్నారు. తమ జీవిత సమస్యలకు తమకు నచ్చిన మార్గంలో సమాధానాలు వెతుక్కుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
ఒకప్పుడు మంత్రవిద్య అంటే సినిమాల్లో మాత్రమే కనిపించేది. ‘Sabrina the Teenage Witch’, ‘Charmed’ వంటి టీవీ షోలు దాన్ని పాపులర్ చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఆ ఆసక్తిని నేరుగా వ్యాపారంగా మార్చేసింది. ఒక రీల్లో క్రిస్టల్ కనిపిస్తుంది. మరో వీడియోలో టారో కార్డులు కనిపిస్తాయి. ఇంకో పోస్టులో మీ జీవితాన్ని మార్చే స్పెల్ గురించి చెబుతారు. ఆసక్తి ఉన్నవాళ్లు అక్కడి నుంచి నేరుగా కొనుగోలు చేసే స్థాయికి వ్యవహారం వెళ్లిపోయింది.
హాస్టీ అభిప్రాయం ప్రకారం, ఇది ఆధ్యాత్మికతను వ్యాపార వస్తువుగా మార్చే ప్రక్రియలో మరో దశ. ప్రేమ సమస్యలు, కెరీర్ టెన్షన్లు, భవిష్యత్తుపై భయాలు.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు యువత ఓదార్పు కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. ఆధునిక మంత్రగత్తెలు కూడా తమను కేవలం మాయలు చేసేవారిగా కాకుండా, ఇతరులకు మానసికంగా అండగా నిలిచే హీలర్లుగా భావిస్తున్నారని ఆమె చెబుతున్నారు. కొందరి దృష్టిలో ఇది కౌన్సెలింగ్ లాంటి సేవ కూడా!
అసలు మ్యాజిక్ మంత్రంలో ఉందా? మనిషి బలహీనతలో ఉందా?
ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం రావడం లేదు.. మంత్రం. ప్రేమించిన వ్యక్తి వదిలేశాడు.. మంత్రం. డబ్బులు కావాలి.. మరో మంత్రం. పెళ్లి రోజు వర్షం పడకూడదు.. ఇంకో మంత్రం. చివరకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఒక ఆన్లైన్ సొల్యూషన్ సిద్ధంగా ఉన్నట్లుంది!
అయితే ఈ ట్రెండ్‌ను కేవలం నవ్వులాటగా తీసిపారేయలేం. ఒంటరితనం, భవిష్యత్తుపై భయం, సంబంధాల్లో అస్థిరత, ఆర్థిక ఒత్తిళ్లు.. ఇవన్నీ మనుషులను ఏదో ఒక భరోసా కోసం వెతికేలా చేస్తున్నాయి. ఆ అవసరాన్ని కొందరు ఆన్లైన్ మంత్రగత్తెలు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మంత్రాలు నిజంగానే అదృష్టాన్ని మార్చేస్తాయనే శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ వాటి కోసం డబ్బులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్లు మాత్రం పెరుగుతున్నారు.
ఇప్పటివరకు మనుషులు తమ సమస్యలకు గూగుల్‌లో పరిష్కారాలు వెతికేవారు. ఇప్పుడు కొందరు గూగుల్లోనే మంత్రగత్తెలను వెతుకుతున్నారు. టెక్నాలజీ ఎంత మారినా.. మనిషికి అదృష్టం మీద ఆశ మాత్రం మారడం లేదనడానికి ఇదొక విచిత్రమైన ఉదాహరణ!
—- సూర్య ప్రకాష్ జోశ్యుల








