ఇండియా అలయెన్స్ ర్యాలీతో నష్టపోయాం… ఢిల్లీ వ్యాపారుల ఆవేదన..!
పండగ సీజన్.. మా వ్యాపారాలు దెబ్బతింటాయి.. దయచేసి తేదీ రీ షెడ్యూల్ చేయండి.. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి.. ఢిల్లీ వ్యాపారుల వినతి. అయితే దీనికి రాహుల్.. తనకు వ్యాపారులంటే ప్రేమ ఉందని.. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తే.. 30 మినిట్స్ లో ఆందోళనలు ఆగిపోతాయన్నారు. అంతేకాదు.. ఢిల్లీకి వచ్చే కార్యకర్తలు.. షాపింగ్ చేయాలని, ఫలితంగా వ్యాపారులకు లబ్ధి కలుగుతుందన్నారు. రాహుల్ తో అయ్యే పని కాదని.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీకి …వ్యాపారులు తమ గోడు వెళ్లబోసుకుంటూ లేఖ రాశారు. దీనిపై సరైన స్పందన రాలేదు. అంతేకాదు.. ర్యాలీ జరిపి తీరతామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.
ఢిల్లీ వ్యాపారుల ఆవేదన..
అన్నట్లుగానే ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. దీంతో ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా .. ఆప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో ఒక్కరోజు వ్యాపారం నిలిచిపోయింది. ఫలితంగా ఢిల్లీ వ్యాపారులకు రూ.11 వేల కోట్ల నష్టం వాటిల్లింది. పండుగల సీజన్లో ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ… ర్యాలీ వల్ల ఢిల్లీకి ప్రత్యక్షంగా రూ.11,000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇందులో రిటైల్, హోల్సేల్ వ్యాపారం ద్వారా రూ.8,800 కోట్లు, రవాణా, లాజిస్టిక్స్ రంగంలో రూ.1,500 కోట్లు, హాస్పిటాలిటీ, పర్యాటక రంగంలో రూ.500 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. రామ్లీలా మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిలోని చాందినీ చౌక్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సదర్ బజార్ వంటి ప్రధాన మార్కెట్లలోని సుమారు 2.5 లక్షల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయని సీటీఐ పేర్కొంది. దీనివల్ల దాదాపు 20 లక్షల మంది రోజువారీ కార్మికులు, వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయారని, వారికి రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ ప్రభుత్వమే బలవంతంగా దుకాణాలను మూయించిందని ఆయన ఆరోపించారు. ర్యాలీకి వచ్చిన వారు స్థానిక వ్యాపారులకు మద్దతుగా షాపింగ్ చేయాలని తాము కోరామని, కానీ బీజేపీ ప్రభుత్వం అన్ని దుకాణాలను మూయించేసిందని ఒక వీడియోలో విమర్శించారు.







