కోమటిరెడ్డి, కొండా అలక తీర్చేదెవరు..!?
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐదు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ, ఈ ఇద్దరు కీలక నేతలు గైర్హాజరు కావడం పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన గైర్హాజరీ కాదని, పార్టీ తీరుపై, ప్రభుత్వ విధానాలపై వారిద్దరి మధ్య నెలకొన్న అంతర్గత అసంతృప్తికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంత్రివర్గం నుంచి తనను తొలగించిన తర్వాత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి కూడా వెళ్లకపోవడం ఆమె వ్యూహాత్మక మౌనానికి అద్దం పడుతోంది. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు, పార్టీలో ఆమె ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని స్పష్టం చేస్తున్నాయి. సురేఖ అనుసరిస్తున్న ఈ ధోరణి అధికార పార్టీని ఇరుకున పెట్టేలా ఉందనే వాదన వినిపిస్తోంది. పార్టీలో తనక తగిన ప్రాధాన్యత లభించడంలేదన్న వేదన ఆమెలో స్పష్టంగా కనిపిస్తోందని, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆమె అనుచరులతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి పూర్తిగా భిన్నంగా సాగుతోంది. రోడ్డు కాంట్రాక్టుల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ఆయన, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా స్థానిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనను పక్కనపెట్టి గట్టుప్పల్ మండల కేంద్రంలో కురుమ సంఘం భవనాన్ని ప్రారంభించడంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో మంచి చేసే వాళ్లకే శత్రువులు పెరుగుతారంటూ ఈ సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తన అసంతృప్తిని తెలియజేస్తున్నాయి.
అంతేకాకుండా తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 10 లోగా అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను హెచ్చరించారు. ఆయన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ యంత్రాంగంపైన, అధికారుల పనితీరుపైన ఆయన బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. పాలనా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలని, పేదలకు న్యాయం అందాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే, సొంత ప్రభుత్వంలోని లోపాలను కూడా ఎత్తిచూపే ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇలాంటి పరిణామాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని చెబుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా కార్యక్రమాలను బహిష్కరించడం లేదా దూరంగా ఉండటం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఇద్దరు నేతల అసంతృప్తిని చల్లార్చడంలో పీసీసీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమన్వయ లోపాలు ఇలాగే కొనసాగితే అది పార్టీ కేడర్‌పై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది.







