తీరు మారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా గళం విప్పారు. రాష్ట్రంలో అవినీతి పెద్దఎత్తున జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనా తీరుపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు లంచాలు ఇస్తేనే తప్ప ఏ ఫైలు కూడా కదలడం లేదు” అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలా పోరాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని నమ్మించి మోసం చేసినా, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను నిధుల కోసం కలిశానని, అయినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన వాపోయారు.
మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపుపై ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి నేరుగా ప్రశ్నలు సంధించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం హుజూర్నగర్ నియోజకవర్గానికే మంత్రా లేక రాష్ట్రం మొత్తానికా? అని ఆయన నిలదీశారు. హుజూరాబాద్ లేదా హుజూర్నగర్ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ, ఫ్లోరోసిస్ పీడిత మునుగోడుకు మాత్రం కనీసం 300 కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధికి తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడబోనని ప్రకటించి కలకలం సృష్టించారు.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అర్హులైన లబ్ధిదారులకు రూ. 4,000 పింఛన్, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిధుల లేమి పేరుతో వాటిని సరిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో, గత కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోయాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.
తాను ఎవరికీ భయపడే వ్యక్తి కాదని, తనను ఎవరూ లంచాలతో లొంగదీసుకోలేరని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ పనితీరును, మంత్రుల కేటాయింపులను బహిరంగంగా ప్రశ్నిస్తుండటం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.







