మలేషియాలో ఘనంగా ముగిసిన తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
కౌలాలంపూర్: తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (Telugu Expats Association of Malaysia – TEAM) ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ “Shuttle Smash Season 3” నవంబర్ 1, 2026న కౌలాలంపూర్‌లోని WP Sentul వేదికగా రెండు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించబడి విజయవంతంగా ముగిసింది.
మలేషియాలోని తెలుగు సమాజంలో క్రీడా స్ఫూర్తిని, ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో TEAM గత కొంతకాలంగా నిరంతరం బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 10వసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో 200కు పైగా జట్లు, 215 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం విశేషం. పిల్లలు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, వెటరన్స్ డబుల్స్ తదితర పలు విభాగాల్లో పోటీలు నిర్వహించబడ్డాయి. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు హాజరై ఈ క్రీడా సంబరానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.
TEAM అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహణ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో ఈ టోర్నమెంట్‌ను అత్యంత క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. క్రీడా సమన్వయకర్తలు సుబాని, చందు టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించి విశేష కృషి చేశారు. TEAM ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ రావు (LKR), జనరల్ సెక్రటరీ శ్రీ ఇంద్రనీల్ గారు, మీడియా కోఆర్డినేటర్ శశి , డిప్యూటీ ఆనంద్ , మహిళా సమన్వయకర్త శ్రీమతి ప్రత్యూష తదితర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమ విజయానికి తమ వంతు సహకారాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి
టోర్నమెంట్ నిర్వహణలో వాలంటీర్లు, సభ్యులు ఎంతో చురుకుగా పాల్గొని తమ సమయాన్ని, శ్రమను వెచ్చించారు. పోటీల నిర్వహణ, షెడ్యూలింగ్, అంపైరింగ్, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. నిర్వహణ కమిటీ సమష్టి కృషి, సభ్యుల సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోహన్ రెడ్డి మరియు FNCA ప్రతినిధి భాస్కర్ రావు విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. విజేతల ఆనందోత్సాహాలు, క్రీడాకారుల ఉత్సాహం, ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ ఒక గొప్ప క్రీడా వేడుకగా నిలిచింది.
TEAM కేవలం క్రీడా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజల మధ్య ఐక్యత, సాంస్కృతిక అనుబంధం, పరస్పర సహకారం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అవసరంలో ఉన్న తెలుగు ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ తన సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది.
ఈ 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన అధ్యక్షులు, నిర్వహణ కమిటీ సభ్యులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, వాలంటీర్లు, స్పాన్సర్లు, క్రీడాకారులు, ప్రేక్షకులు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ TEAM హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
“క్రీడల ద్వారా ఐక్యత – సేవ ద్వారా సమాజ అభివృద్ధి” అనే స్ఫూర్తితో TEAM భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు సమాజ అభ్యున్నతికి కృషి చేయనుంది.
మరిన్ని వివరాల కోసం:
వెబ్సైట్: https://www.teluguexpats.com.







