అమిత్ షాతో చిరంజీవి భేటీ.. అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారు. దీంతో వీళ్ల భేటీలో ఏం చర్చించి ఉంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటిన్నిటికీ భిన్నంగా అమిత్ షా, చిరంజీవి భేటీ జరిగింది.
ముఖ్యంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు సొసైటీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం. దీనికి అడ్డుకట్ట వేయాలని చిరంజీవి, అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు, నటీమణులను టార్గెట్ చేస్తూ క్రియేట్ చేస్తున్న ‘డీప్ ఫేక్’ వీడియోల అంశాన్ని ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ సాంకేతికత వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ముప్పును ఆయన వివరించారు.
కొద్దికాలంగా నటీనటుల మార్ఫ్ చేసిన వీడియోలు, అసభ్యకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటను వక్రీకరించి నటి జాన్వీ కపూర్ పై సృష్టించిన ఏఐ మానిప్యులేటెడ్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన చిరంజీవి, అక్టోబర్ 3న ఎక్స్ వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. కేవలం సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టకుండా, ఈ సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి నేరుగా తీసుకెళ్లాలని ఆయన భావించారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ వచ్చిన అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కళాకారుల హక్కులకు, గౌరవానికి కలుగుతున్న భంగం గురించి చిరంజీవి అమిత్ షాకు పూసగుచ్చినట్లు వివరించారు. సినీ పరిశ్రమ తరఫున ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కఠినమైన చట్టాలు, రక్షణ చర్యలు అవసరమని ఆయన కోరారు.
చిరంజీవి లేవనెత్తిన అంశాలను సానుకూలంగా స్వీకరించిన హోంమంత్రి అమిత్ షా, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పటిష్టమైన చట్టపరమైన చర్యలు, కఠినమైన శిక్షలు ఉండేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయమై పూర్తి వివరాలతో కూడిన రాతపూర్వక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలని అమిత్ షా సూచించగా, ఆ బాధ్యతలను సమన్వయం చేయడానికి జి. కిషన్ రెడ్డికి అప్పగించారు.
ఈ సమావేశంలో చిరంజీవి కేవలం ఫిర్యాదు చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కొన్ని కీలక ప్రతిపాదనలను కూడా తెరపైకి తెచ్చారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇతర ప్రముఖ పరిశ్రమ సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని, సపోర్ట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రపోజ్ చేశారు. ఈ ప్రతిపాదిత యంత్రాంగం సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేసి, బాధితులకు అండగా నిలవాలని, అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
హోంమంత్రి సానుకూల స్పందన పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది సినీ పరిశ్రమకు ఎంతో ప్రోత్సాహకరమైన ముందడుగు అని అభివర్ణించారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టే బృహత్తర ప్రయత్నంలో ఫిల్మ్ ఫ్రటర్నిటీ, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులందరూ భాగస్వాములు కావాలని చిరంజీవి పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు.







