బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ చెక్ పెడుతోందా!?
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం- వరంగల్- నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాత్మక అడుగులు, ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగా మారాయి. ప్రత్యర్థి పార్టీల బలహీనతలను ఆసరాగా చేసుకుని, పావులు కదుపుతున్న అధికార పక్షం తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న కీలక నేత, పీఆర్టీయూ ప్రముఖ నాయకుడు భిక్షం గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ టికెట్ రేసులో ఉన్న వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం వెనుక కారణాలపై ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. బీజేపీ టికెట్ రాదనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే సీఎంను కలిశారా.. లేకుంటే అధికార పార్టీ వేసిన ఎత్తుగడ దాగి ఉందా అనే కోణంలో అనేక విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందని చెబుతున్నా, దీనికి రాజకీయ రంగు పులుముకోవడం అనివార్యమైంది.
ప్రతిపక్ష వ్యూహాలకు చెక్ పెట్టే లక్ష్యంతోనే కాంగ్రెస్ నాయకత్వం ఈ రకమైన ఎత్తుగడలకు తెరలేపినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, విద్యావంతుల మద్దతును కూడగట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు కోసం అధికార పక్షం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యామ్నాయ పార్టీల నేతలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థి శిబిరాన్ని మానసికంగా దెబ్బకొట్టాలనే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు.. బీజేపీ అభ్యర్థి ఎంపికపై కమల దళంలో జరుగుతున్న అంతర్గత కసరత్తు కూడా ఈ పరిణామాలకు ఆజ్యం పోస్తోంది. పార్టీ నేతకే టికెట్ ఇవ్వాలని బీజేపీలో కొందరు నేతలు గట్టిగా పడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అసంతృప్త నేతలపై ప్రత్యేక దృష్టి సారించి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. భిక్షం గౌడ్ లాంటి ప్రభావశీలమైన నేతను తమ వైపునకు తిప్పుకోగలిగితే, అది ప్రత్యర్థి పార్టీకి తీరని నష్టాన్ని మిగల్చడమే కాక, ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుస్తుందని కాంగ్రెస్ లెక్క వేస్తోంది.
ఈ మొత్తం పరిణామాలు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కేవలం ఒక మర్యాదపూర్వక భేటీగా ప్రారంభమైన ఈ సమావేశం, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రచార అస్త్రంగా మారింది. భిక్షం గౌడ్ భవిష్యత్తు కార్యాచరణ ఏంటో రానున్న రోజుల్లో స్పష్టత రానున్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న ఈ వ్యూహాత్మక ఎత్తుగడల్లో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.







