టీడీపీలో మహిళా పవర్.. ఎన్నికల వేళ తగ్గేదే లేదంటున్న లేడీ లీడర్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నాయకత్వం తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీలో (TDP) మహిళా నేతల చురుకైన పాత్ర ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మహిళా నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితం కాకుండా పార్టీ విస్తరణ, కేడర్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ (Municipal) , ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లోనూ వీరి రాజకీయ కార్యాచరణ స్పష్టంగా కనిపించింది.
కడప (Kadapa) ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి (R. Madhavi Reddy) తాజా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కడప కార్పొరేషన్‌తో పాటు నియోజకవర్గ పరిధిలో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ప్రత్యేకంగా పనిచేశారు. స్థానికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యర్థి వైసీపీ నాయకుల రాజకీయ వ్యూహాలను ఎదుర్కొనే విషయంలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. తన నియోజకవర్గంలో పార్టీ పట్టు కొనసాగించడంతో పాటు భవిష్యత్తు ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.
మరోవైపు ఉమ్మడి అనంతపురం (Anantapuram) జిల్లాకు చెందిన మంత్రి సంజీవరెడ్డిగారి సవిత (S. Savitha) కూడా ఎన్నికల సమయంలో ప్రత్యేక చొరవ చూపించారు. రాజకీయంగా దూకుడైన వ్యాఖ్యల కంటే ప్రజలతో సంబంధాలు కొనసాగించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆమె ఎక్కువగా దృష్టి పెట్టారు. కూటమి అభ్యర్థుల విజయానికి స్థానిక నాయకులతో కలిసి పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీకి అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు. ఆమె చొరవతో పలు మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గంలో పులివర్తి సుధా రెడ్డి (Pulivarthi Sudha Reddy) పేరు కూడా ఎన్నికల సమయంలో ప్రముఖంగా వినిపించింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్యగా రాజకీయ వర్గాలకు పరిచయమైన ఆమె, పోలింగ్ సమయంలో మంగళం కేంద్రం వద్ద చురుగ్గా వ్యవహరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కదలికలను గమనిస్తూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా తాను కూడా అనుసరిస్తానని, ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తానని చెప్పడం అప్పట్లో రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు.
ఈ ముగ్గురు నాయకురాళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో టీడీపీకి చెందిన మహిళా నాయకులు కూడా ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయి సమన్వయం, ఓటర్లను కలవడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం కేడర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. రాజకీయాల్లో మహిళలు కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా ఎన్నికల వ్యూహాలు, పార్టీ నిర్వహణలోనూ కీలక బాధ్యతలు చేపడుతున్నారనే విషయాన్ని తాజా పరిణామాలు మరోసారి చాటుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీలో మహిళా నాయకత్వం ఇంకెంత విస్తరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.







