ట్రంప్ ఓటమికి బలిపశువుగా సుసీ వైల్స్, తెర వెనక ఏం జరిగింది?
ప్రతీ వ్యవస్థలోనూ బలిపశువులు ఉంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో వీళ్ల సంఖ్య ఇంకాస్త ఎక్కువే! అధికారం ఉన్నప్పుడు అంతా తమ గొప్పతనమేనని చెప్పుకునే నాయకులు.. ఓటమి ఎదురైతే మాత్రం ఆ నిందను మరొకరి మీదకు నెట్టేస్తుంటారు. తప్పు ఎవరు చేసినా చివరికి బలయ్యేది మాత్రం తెర వెనుక పనిచేసిన వాళ్లే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోనూ ఇదే జరిగిందా?
మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి ట్రంప్ తనకు అత్యంత నమ్మకమైన సలహాదారు సుసీ వైల్స్‌ను బలిపశువుగా మార్చేశారా? ఒకప్పుడు వైట్‌హౌస్‌లో అత్యంత శక్తిమంతమైన మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. ఇప్పుడు పదవి కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు ట్రంప్ ఓటమికి ఆమెనే బాధ్యురాలిగా ఎందుకు చూపిస్తున్నారు? ఆమె నిష్క్రమణతో ఎవరికి లాభం కలిగింది?
ఓటమి తర్వాత మారిన ట్రంప్ వైఖరి!
ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ కీలక రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న సుసీ వైల్స్.. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. కానీ మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా రాకపోవడంతో ఆమె పదవికి ఎసరు వచ్చింది. రిపబ్లికన్లకు బలమైన పట్టున్న ఐవా, కాన్సాస్, మిసిసిపీ, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో సెనేట్ స్థానాలు డెమొక్రాట్ల ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ రాజకీయ ఎదురుదెబ్బల తర్వాత ట్రంప్ తన టీమ్ లో మార్పులు మొదలుపెట్టారు. అందులో భాగంగా సుసీని తప్పించి ఆమె స్థానంలో స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు.
రాజీనామా కాదు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయమేనా?
సుసీ వైల్స్ గురువారం రాత్రి రాజీనామా లేఖ ఇచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై సందేహాలు పెంచాయి. తానే మార్పు కోరుకున్నానని, సుసీ చాలా బాగా పనిచేసినా ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. పైకి ఆమె పనితీరును ప్రశంసించినా, పదవి నుంచి తప్పించడం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పదవి పోయింది.. విమర్శలు మాత్రం ఆగలేదు!
సుసీ వైల్స్ తన వీడ్కోలు సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టగానే విమర్శలు మొదలయ్యాయి. ఒకప్పుడు వైట్‌హౌస్‌లో కీలక అధికారిగా ఉన్న ఆమెను ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ ద్రోహానికి మీరు నాయకత్వం వహించారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, రచయిత్రి షార్లెట్ క్లైమర్ కూడా ఆమెపై ఘాటు విమర్శలు చేశారు. ది అట్లాంటిక్ రచయిత నార్మన్ ఆర్న్స్టీన్ సైతం చరిత్ర మీకు అనుకూలంగా తీర్పు చెప్పదంటూ స్పందించారు.
సుసీ స్థానంలోకి స్టీఫెన్ మిల్లర్.. మరొకరికి ఊరట!
సుసీ వైల్స్ నిష్క్రమణతో ఆమె స్థానంలోకి స్టీఫెన్ మిల్లర్ వచ్చారు. ఈ నియామకం బయటకు వచ్చిన వెంటనే రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో మిల్లర్‌ను ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. ఆయన నిజమైన దేశభక్తుడని, అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అయితే సుసీ వైల్స్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సుసీ వైల్స్ గతంలో హెగ్సెత్ పెంటగాన్ నిర్వహణ తీరుపై అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఆమె నిష్క్రమణతో హెగ్సెత్కు ప్రస్తుతానికి పదవీ గండం తప్పినట్లు కనిపిస్తోందని ఏబీసీ న్యూస్‌కు చెందిన జోనాథన్ కార్ల్ పేర్కొన్నారు. దీంతో వైట్‌హౌస్‌లో జరుగుతున్న మార్పుల వెనుక అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
మహిళా అధికారులకు వరుసగా ఉద్వాసనలు!
సుసీ వైల్స్ ఒక్కరే కాదు.. ట్రంప్ రెండో విడత ప్రభుత్వంలో పలువురు కీలక మహిళా అధికారులు కూడా పదవులు కోల్పోయారు. ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా, అటార్నీ జనరల్ పామ్ బాండీ, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, కార్మిక శాఖ కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా గుర్తింపు పొందిన సుసీ కూడా ఇప్పుడు అదే బాట పట్టడం గమనార్హం.
మొత్తానికి ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ట్రంప్ తన టీమ్‌ను మార్చుకుంటున్నారు. అయితే ఈ మార్పులు నిజంగా పాలనలో లోపాలను సరిదిద్దడానికా? లేక రాజకీయంగా ఎదురైన పరాజయానికి బాధ్యులను వెతికే ప్రయత్నమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. ఏదేమైనా.. అధికారం ఉన్నప్పుడు ట్రంప్‌కు అండగా నిలిచిన సుసీ వైల్స్, ఓటమి తర్వాత మాత్రం పదవి కోల్పోవడం రాజకీయాల్లో బలిపశువుల కథకు మరో ఉదాహరణగా నిలిచింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల






