బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుకి ఆహ్వానం..
ఒంగోలులో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలలు) – 2026 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని గోవా గవర్నర్ పి.అశోక్ గజపతి రాజును ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు ఆహ్వానించారు. గోవాలోని లోక్ భవన్లో గవర్నర్ను కలిసి వారు అధికారికంగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ మహాసభలు జరగనున్నాయి.
తెలుగు భాషా చరిత్రలో తొలిసారిగా బాలల కోసం ప్రత్యేకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, కళల పట్ల బాలబాలికల్లో ఆసక్తిని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ఆయన కొనియడమే కాకుండా, డిసెంబర్ 19న జరిగే ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు డా. గజల్ శ్రీనివాస్ వెల్లడించారు.







