ఎవరీ స్టీఫెన్ మిల్లర్? ట్రంప్‌కు అంతలా నచ్చడానికి కారణమేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన సలహాదారుగా ఉన్న స్టీఫెన్ మిల్లర్‌కు వైట్‌హౌస్‌లో అత్యంత కీలకమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించారు. రిపబ్లికన్ పార్టీ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఎదుర్కొన్న పరాజయం తర్వాత ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వలస విధానాల విషయంలో కఠిన వైఖరికి పేరొందిన మిల్లర్‌కు ఈ పదవి దక్కడంతో ట్రంప్ తన విధానాలను మరింత దూకుడుగా అమలు చేయబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎవరీ స్టీఫెన్ మిల్లర్
41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ 2016 నుంచి ట్రంప్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రంప్ ప్రసంగాల రూపకల్పన నుంచి వలస విధానాల నిర్ణయాల వరకు అనేక అంశాల్లో ఆయన ప్రభావం ఉంది. అమెరికాలో అక్రమ వలసలను అడ్డుకోవడం, భారీ స్థాయిలో వలసదారులను దేశం నుంచి పంపించడం వంటి ట్రంప్ విధానాల వెనుక ప్రధాన వ్యూహకర్తగా మిల్లర్‌ను పరిగణిస్తారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో మిల్లర్‌ను తన అత్యంత నమ్మకమైన సలహాదారుల్లో ఒకరిగా అభివర్ణించారు. సోమవారం నుంచి ఆయన కొత్త బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సూసీ వైల్స్ స్థానంలో మిల్లర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే ఈ నియామకం కేవలం ఒక పదవిలో మార్పు మాత్రమే కాదు. ట్రంప్ ప్రభుత్వంలో ఇప్పటివరకు విధానాల రూపకల్పనలో కీలకంగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు మొత్తం వైట్‌హౌస్ యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యత కూడా దక్కనుంది.
చిన్న వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి
వైట్‌హౌస్‌లోకి రాకముందే స్టీఫెన్ మిల్లర్ సంప్రదాయవాద రాజకీయ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికా హైస్కూల్లో చదువుతున్న రోజుల నుంచే ఆయన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసేవారు. స్థానిక రేడియో కార్యక్రమాల్లో పాల్గొంటూ పాఠశాలల్లో అమలవుతున్న ఉదారవాద విధానాలను విమర్శించేవారు.
తర్వాత డ్యూక్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో డ్యూక్ కన్జర్వేటివ్ యూనియన్‌కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న యూనివర్సిటీకి చెందిన ముగ్గురు లాక్రోస్ క్రీడాకారులకు ఆయన బహిరంగంగా మద్దతు తెలిపారు.
చదువు పూర్తయిన తర్వాత వాషింగ్టన్కు వెళ్లిన మిల్లర్ రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ సభ్యుల వద్ద లెజిస్లేటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. రిపబ్లికన్ సెనేటర్ జెఫ్ సెషన్స్ వద్ద కూడా పనిచేశారు.
2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఆయన ప్రచార బృందంలో చేరారు. ట్రంప్ ప్రసంగాలు, రాజకీయ సందేశాలు, ప్రత్యర్థులపై విమర్శలు చేసే తీరు రూపుదిద్దుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించారు.
ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ 2017లో అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. మొదటి నుంచే ట్రంప్, మిల్లర్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ట్రంప్ తన రాజకీయ స్వరాన్ని కనుగొనడంలో మిల్లర్ సహాయపడ్డారని వ్యాఖ్యానించారు.
ట్రంప్ తొలి ప్రభుత్వంలో ఏం చేశారు?
2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత మిల్లర్ అధ్యక్షుడి సలహాదారుగా, ప్రసంగ రచయితగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా వలస విధానాల విషయంలో ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది.
అమెరికా సరిహద్దులను కాపాడటం, అక్రమ వలసలను అడ్డుకోవడం పేరుతో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అనేక కఠిన నిర్ణయాల వెనుక మిల్లర్ ఉన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఈ విధానాలను ఆయన పాశ్చాత్య నాగరికత పరిరక్షణతో ముడిపెట్టి సమర్థించేవారు.
అయితే ఆయన రాజకీయ వైఖరిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. మిల్లర్ తెల్లజాతి ఆధిపత్య భావజాలానికి మద్దతు ఇస్తున్నారంటూ డెమొక్రాటిక్ పార్టీ నేతలు ఆరోపించారు. 2019లో సదరన్ పావర్టీ లా సెంటర్ కొన్ని ఈమెయిళ్లను విడుదల చేసింది. వాటిలో మిల్లర్ తెల్లజాతి జాతీయవాద వెబ్సైట్లు, భావజాలానికి మద్దతు తెలిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆయనను వైట్‌హౌస్ నుంచి తొలగించాలని డెమొక్రాటిక్ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై మిల్లర్ తన వైఖరిని సమర్థించుకున్నారు.
2018లో అమెరికా న్యాయశాఖ తీసుకొచ్చిన ‘జీరో టాలరెన్స్’ విధాన రూపకల్పనలోనూ మిల్లర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తింపు ఉంది. ఈ విధానం ప్రకారం సరైన పత్రాలు లేకుండా అమెరికా సరిహద్దులు దాటే దాదాపు ప్రతి వయోజనుడిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నిర్ణయించారు.
దీని ప్రభావంతో తల్లిదండ్రుల నుంచి చిన్నారులను వేరు చేసే పరిస్థితి ఏర్పడింది. నేర విచారణలో ఉన్న పెద్దలతో పాటు పిల్లలను నిర్బంధ కేంద్రాల్లో ఉంచడానికి నిబంధనలు అనుమతించకపోవడంతో అనేక కుటుంబాలు విడిపోయాయి. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో ట్రంప్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ విధానాన్ని మార్చాల్సి వచ్చింది.
ఇక చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన పత్రాలు లేని వలసదారులకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే డీఏసీఏ (DACA) కార్యక్రమాన్ని రద్దు చేయాలని కూడా మిల్లర్ ప్రయత్నించారు.
2017లో పలు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధించిన నిర్ణయం వెనుక కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. దీనినే అప్పట్లో ‘ముస్లిం ట్రావెల్ బ్యాన్’గా పిలిచారు. సిరియా, ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులపై తొలుత 90 రోజుల ప్రవేశ నిషేధం విధించారు. మార్పులు చేసిన తర్వాత ఈ విధానాన్ని అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ట్రంప్ చేసిన ఎన్నికల అక్రమాల ఆరోపణలకు మిల్లర్ మద్దతుగా నిలిచారు. ఎన్నికల్లో ట్రంప్‌నే విజేతగా ధ్రువీకరించేందుకు జరిగిన ప్రయత్నాల్లోనూ ఆయన పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి.
ట్రంప్ 2.0లో మరింత కీలకంగా మారిన మిల్లర్
2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ తిరిగి రాజకీయాల్లో పుంజుకుంటున్న సమయంలోనూ మిల్లర్ ఆయనకు అండగా నిలిచారు. 2025 జనవరిలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్‌కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ, హోంల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ బాధ్యతలు అప్పగించారు.
ఈసారి ఆయన ప్రభావం మరింత పెరిగింది. అమెరికాలో అక్రమ వలసదారులను భారీ స్థాయిలో గుర్తించి దేశం నుంచి పంపించాలనే ట్రంప్ ప్రభుత్వ కార్యక్రమానికి మిల్లర్ ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారుల ద్వారా దేశవ్యాప్తంగా అరెస్టులు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2025 మేలో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన మిల్లర్.. రోజుకు కనీసం 3,000 మంది వలసదారులను అరెస్ట్ చేయాలన్న లక్ష్యాన్ని ట్రంప్ ప్రభుత్వం పెట్టుకుందని వెల్లడించారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని అధ్యక్షుడు భావిస్తున్నారని చెప్పారు.
వలసదారులపై అధికారులు అనుసరిస్తున్న కఠిన చర్యలను కూడా మిల్లర్ సమర్థించారు. 2026 జనవరిలో మిన్నియాపొలిస్‌లో జరిగిన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ సందర్భంగా రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి అనే ఇద్దరు వ్యక్తులు ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో మరణించారు. మొదట్లో వారిద్దరినీ మిల్లర్ ఉగ్రవాదులుగా అభివర్ణించారు. అయితే అలెక్స్ ప్రెట్టి విషయంలో తర్వాత తన వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారు.
పాలస్తీనా హక్కులకు మద్దతు తెలిపే వారిపైనా ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంలో మిల్లర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను విమర్శించిన కొందరు విదేశీ విద్యార్థులు, వీసాదారులు, శాశ్వత నివాసితులను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు జరిగాయి.
అమెరికా విదేశాంగ విధానంపైనా మిల్లర్ ప్రభావం
మిల్లర్ ప్రభావం కేవలం వలస విధానాలకే పరిమితం కాలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మహక్కు పౌరసత్వాన్ని (Birthright Citizenship) రద్దు చేయాలన్న ప్రయత్నానికి కూడా ఆయన మద్దతుగా నిలిచారు. అయితే ఆ ప్రయత్నం న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది.
అంతేకాదు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలవంతంగా అదుపులోకి తీసుకున్న చర్యను కూడా మిల్లర్ సమర్థించారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే హక్కు ఉందంటూ జనవరిలో సీఎన్ఎన్తో మాట్లాడినప్పుడు వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ నిబంధనలు, దౌత్యపరమైన మర్యాదల గురించి ఎంత మాట్లాడినా ప్రపంచం చివరకు బలం, సైనిక శక్తి, అధికారంతోనే నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చరిత్ర మొదటి నుంచి ఈ శక్తి సూత్రాలే కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు.
చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే ఎంతటి పవర్ఫుల్ పదవి?
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఒకటి. అధ్యక్షుడి సిబ్బంది నియామకాలు, వైట్‌హౌస్ కార్యకలాపాల నిర్వహణ, అధ్యక్షుడి రోజువారీ షెడ్యూల్, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి బాధ్యతలు ఈ పదవిలో ఉంటాయి.
అంతేకాదు, అధ్యక్షుడిని ఎవరు కలవాలి? ఏ అంశం ఆయన దృష్టికి వెళ్లాలి? ఏ విధానంపై ఎప్పుడు చర్చ జరగాలి? వంటి విషయాల్లోనూ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు కీలక పాత్ర ఉంటుంది. అందుకే ఈ పదవిని అమెరికా అధ్యక్షుడి దగ్గరకు వెళ్లే సమాచారానికి గేట్‌కీపర్‌గా అభివర్ణిస్తుంటారు.
అయితే మిల్లర్‌కు ఈ పదవి రావడంతో ఆయనకు ట్రంప్‌పై ఉన్న ప్రభావం ఎంత మేరకు మారుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. కానీ ఇప్పటికే విధానాల రూపకల్పనలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు వైట్‌హౌస్ మొత్తం వ్యవస్థను సమన్వయం చేసే బాధ్యతలు చేపట్టడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







