మంత్రముగ్ధులను చేసిన “అనన్య మంత్రవాది” అన్నమ స్వరార్చన
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఈ శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించే వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఉదయం 5గం.లకు సుప్రభాత సేవ, మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి (గురు స్తుతి) పారాయణాలతో కార్యక్రమం ప్రారంభం కాగా అనంతరం సాయంత్రం 6 గంటలకు అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థిని అనన్య మంత్రవాది శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అన్నమాచార్య సంకీర్తనలతో మంత్రముగ్ధ స్వరార్చన చేసింది. ఈ సందర్భంగా “హరి అవతారమితడు”, “అప్పని వరప్రసాది”, “మాతంగ పర్వత”, “జయలక్ష్మీ వరలక్ష్మీ”, “సర్వం విష్ణుమయం”, “సకల సంగ్రహము”, “అదిగో అల్లదిహో”, “మహినుద్యోగి”, “ఎంత చక్కని దానవమ్మ” తదితర సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై శాస్త్రి, తబలాపై స్వరూప్ వాద్య సహకారం అందించారు.
తదుపరి పద్మశ్రీ డా. శోభారాజు గారు ఒక అన్నమాచార్య సంకీర్తనకు భావార్థ వివరణ అందించి అనన్య మంత్రవాదిని ఆశీర్వదించి స్వామి వారి జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా స్వామివారికి మంగళహారతి, భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.







