ఇనిస్ట్రాలో రీల్స్ చూస్తే జీతం, ఈ ఉద్యోగం గురించి తెలుసా?
Reels.. ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయాయి. ఖాళీ సమయం దొరికితే చాలు Instagram ఓపెన్ చేసి స్క్రోలింగ్ మొదలుపెడతాం. ఒక్కో వీడియో చూస్తూ నవ్వుకుంటాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం, వింతల్ని చూస్తూ ఆశ్చర్యపోతాం. ఐదు నిమిషాల కోసం ఫోన్ చేతిలోకి తీసుకుంటే గంటలు గడిచిపోయినా తెలియదు. చివరికి ఫోన్ పక్కన పెట్టమని ఇంట్లోవాళ్లతో చివాట్లు కూడా తింటుంటాం. కానీ ఈ Reels ప్రపంచం మన అలవాట్లనే కాదు.. సంపాదన మార్గాల్ని కూడా మార్చేస్తోంది.
ఒకప్పుడు సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం అంటే టైమ్ వేస్ట్ అనుకునేవాళ్లు. ఇప్పుడు అదే ప్రపంచాన్ని కొందరు కెరీర్‌గా మార్చుకుంటున్నారు. కంటెంట్ క్రియేటర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. Reels చూసేవాళ్లకు కూడా ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఈ ట్రెండ్ చేరుకుంది. వినడానికి కాస్త వింతగా అనిపించినా, ఓ కంపెనీ ఇచ్చిన ఈ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ఉద్యోగంలో ఏం చేయాలి? ఎవరికీ ఈ అవకాశం దక్కుతుంది?
రోజంతా స్క్రోలింగ్ చేయాలి.. ట్రెండ్స్ కనిపెట్టాలి!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన Influish అనే కంపెనీ ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆ పోస్టు పేరు ‘Professional Doomscroller’. అంటే రోజంతా Instagram Reels చూస్తూ ఉండటమే ఈ ఉద్యోగంలో ప్రధానమైన పని. అయితే ఊరికే వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తే సరిపోదు. Instagramలో ఏ కంటెంట్ వైరల్ అవుతోంది? ఏ కొత్త ట్రెండ్స్ మొదలవుతున్నాయి? ఏ వీడియోలకు నెటిజన్ల నుంచి ఎక్కువ స్పందన వస్తోంది? ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గుర్తించి కంపెనీకి తెలియజేయాలి.
ఈ ఉద్యోగం గురించి కంపెనీ సిబ్బంది సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో తమకు Instagram వాడటం బాగా ఇష్టపడే వ్యక్తి కావాలని, రోజంతా Reels చూస్తూ ఏది వైరల్ అవుతుందో గుర్తించి టీమ్‌కు చెప్పాలని వివరించారు. సాధారణంగా మనం సరదాగా చేసే పనినే ఉద్యోగంగా మార్చేయడం ఈ ప్రకటనలో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం.
అప్లై చేయడానికి పెద్ద ప్రాసెస్ లేదు!
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్‌గా ఉంది. ఆసక్తి ఉన్నవాళ్లు కంపెనీ పోస్ట్ చేసిన వీడియో కింద ‘Hi’ అని కామెంట్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ ఉద్యోగావకాశం ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో ఉండేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. అక్కడి అభ్యర్థులకు Instagram DM ద్వారా అప్లికేషన్ లింక్ పంపిస్తారు.
నవంబర్ 4న ఈ వీడియోను పోస్ట్ చేయగా, కొద్ది సమయంలోనే భారీ స్పందన వచ్చింది. ఇప్పటికే 3.4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, అప్లికేషన్ ఫామ్ కావాలని ఏకంగా 11 వేల మందికి పైగా రిక్వెస్ట్ చేసినట్లు Influish వెల్లడించింది. అంటే Reels చూస్తూ ఉద్యోగం చేయొచ్చనే ఆలోచన యువతకు ఎంతగా నచ్చిందో ఈ స్పందన చూస్తే అర్థమవుతోంది.
‘ఇంతకంటే మంచి ఉద్యోగం ఏముంటుంది?’
ఈ ప్రకటన చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు దీన్ని పర్ఫెక్ట్ ఉద్యోగమని అభివర్ణిస్తుంటే, మరికొందరు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. రోజూ గంటల తరబడి Instagramలో గడిపేవాళ్లకు ఇది నిజంగానే డ్రీమ్ జాబ్‌లా కనిపిస్తోంది.
అయితే ఈ ఉద్యోగంలో ఓ విషయం గుర్తుంచుకోవాలి. కేవలం Reels చూస్తూ కూర్చుంటే జీతం వచ్చేయదు. ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది? ఏ రకమైన కంటెంట్‌ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? కొత్తగా ఏ ట్రెండ్ మొదలవుతోంది? అనే విషయాలను అర్థం చేసుకుని కంపెనీకి ఉపయోగపడే సమాచారాన్ని అందించాలి. అంటే ఇందులోనూ పరిశీలన, సోషల్ మీడియా ట్రెండ్స్‌పై అవగాహన చాలా ముఖ్యం.
స్క్రోలింగ్ కూడా ఓ కెరీర్‌గా మారుతోందా?
నిజానికి ఈ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియా ప్రపంచంలో వస్తున్న మార్పులకు ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఒకప్పుడు Instagram అంటే ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వేదికగా ఉండేది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారాలు పెరుగుతున్నాయి, బ్రాండ్లు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్నాయి, కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఏ కంటెంట్ ఎప్పుడు వైరల్ అవుతుందో ముందుగానే గుర్తించడం కూడా కంపెనీలకు కీలకంగా మారింది. అందుకే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే వ్యక్తులకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఇప్పటివరకు Reels ఎక్కువగా చూస్తున్నారని ఇంట్లోవాళ్లు ఫోన్ పక్కన పెట్టమని చెబితే.. ఇకపై ‘నేను ట్రెండ్స్ స్టడీ చేస్తున్నా’ అని చెప్పుకునే రోజులు వచ్చినట్టే! అయితే ఈ ఉద్యోగానికి ఎంత జీతం ఇస్తారు? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? వంటి వివరాలను కంపెనీ ప్రకటనలో వెల్లడించలేదు. ఏదేమైనా, ఒకప్పుడు టైమ్‌పాస్‌గా భావించిన స్క్రోలింగ్‌ను ఉద్యోగంగా మార్చే ఆలోచన మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరతీసింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







