కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ‘సండియర్’ షూటింగ్ ప్రారంభం
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం ప్రత్యేక కానుక అందించింది. ప్రముఖ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్, కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. కమల్ హాసన్ పుట్టినరోజునే సినిమా ప్రొడక్షన్ ప్రారంభం కావడంతో చిత్రబృందానికి ఇది ప్రత్యేకమైన సందర్భంగా నిలిచింది.
కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగా, నవంబర్ 6న మేకర్స్ ఈ చిత్రానికి ‘సండియర్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు, ఆసక్తి నెలకొన్నాయి.
కమల్ హాసన్ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా నవంబర్ 7న కెమెరాలు ఆన్ కావడంతో సినిమా మరో కీలక దశలోకి అడుగుపెట్టింది.
విభిన్నమైన కథాంశాలు, ఆకట్టుకునే కథనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్.. తన అద్భుతమైన నటన, ప్రతి తరంలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే విలక్షణతతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న కమల్ హాసన్‌తో చేతులు కలిపారు. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.
‘సండియర్’ చిత్రానికి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్స్ అన్బరివ్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు. కె.ఎస్. సునీల్ సినిమాటోగ్రాఫర్‌గా, సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమృతా రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
‘సండియర్’ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్కేఎఫ్ఐ), టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నవంబర్ 6న టైటిల్ ప్రకటన, నవంబర్ 7న షూటింగ్ ప్రారంభంతో ‘సండియర్’ చిత్రం కమల్ హాసన్ పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ప్రయాణానికి అద్భుతమైన ఆరంభం లభించింది.
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.







