విద్యార్థినుల చేతులు పట్టుకుని.. అశ్లీల వీడియోలు చూపిస్తూ…! JNU ప్రొఫెసర్‌పై 11 మంది ఫిర్యాదు
క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్.. విద్యార్థినుల చేతులు పట్టుకోవడం, వారి వ్యక్తిగత జీవితాల గురించి ఆరా తీయడం, ప్రొజెక్టర్‌పై లైంగిక అంశాలతో కూడిన వీడియోలు చూపించడం.. ఇలాంటివి చేస్తే ఏం చేయాలి? ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఇప్పుడు ఇదే వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్‌పై 11 మంది విద్యార్థినులు లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఫిర్యాదులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
క్లాస్‌లో చేతులు పట్టుకోవడం దగ్గర నుంచి ఇంటికి పిలిచి వివా నిర్వహించడం వరకు విద్యార్థినులు చేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అంతేకాదు, చదువులో భాగమంటూ ప్రొజెక్టర్‌పై అభ్యంతరకరమైన వీడియో క్లిప్స్ చూపించేవారని కూడా కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ జరిపింది. పలు ఆరోపణలు నిజమేనని కమిటీ నిర్ధారించినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. దీంతో అక్టోబర్ 9న ప్రొఫెసర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 11న పోలీసు కేసు కూడా నమోదైంది. అయితే నవంబర్ 2న ఢిల్లీ హైకోర్టు తొలగింపు ఉత్తర్వులపై స్టే విధించింది.
ఇంటికి పిలిచి స్టడీ సెషన్లు.. అక్కడే అసలు వ్యవహారం?
విద్యార్థులు వెల్లడించిన వివరాలు ప్రకారం..2026 మే మొదటి వారంలో సోషల్ సైన్సెస్ విభాగంలో క్లాస్ ముగిసిన తర్వాత ప్రొఫెసర్ బిమోల్ విద్యార్థులతో మాట్లాడుతూ, వివాకు ముందు ఎవరికైనా సందేహాలుంటే తన ఇంటికి వచ్చి చర్చించుకోవచ్చని చెప్పారు. అక్కడ సరదాగా స్టడీ సెషన్ కూడా ఉంటుందని నవ్వుతూ ఆహ్వానించారు.
చదువుకు సంబంధించిన సందేహాలు తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మాటలు క్రమంగా వ్యక్తిగత విషయాల వైపు మళ్లేవని ఒక విద్యార్థిని తెలిపింది. మొదట సబ్జెక్టుకు సంబంధించిన చర్చ జరిగినప్పటికీ, ఆ తర్వాత కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితాలు, సంబంధాల గురించి ప్రశ్నలు అడిగేవారని ఆరోపించింది. అంతేకాదు, పాఠాలు చెబుతున్న సమయంలో కూడా ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకునేవారని వెల్లడించింది.
మరో విద్యార్థి చెప్పిన వివరాలు కూడా ఇక్కడ గమనించాల్సినవే. క్లాస్‌లో అందరి ముందు తీవ్రంగా తిట్టడం, అవమానించేలా మాట్లాడటం చేసేవారని, అదే ఇంట్లో వివా నిర్వహించేటప్పుడు మాత్రం చాలా సులభంగా పరీక్ష ముగించేవారని తెలిపాడు. కొన్నిసార్లు ఇంటికి పిలిచిన విద్యార్థులను ఐదు నిమిషాల్లోనే ఏదో కారణం చెప్పి వెనక్కి పంపించేవారట. అయితే కొంతమంది అమ్మాయిలను మాత్రం అక్కడే ఉంచేవారని, అప్పట్లో వారిని ప్రొఫెసర్‌కు ఇష్టమైన విద్యార్థినులుగా భావించామని మరో విద్యార్థి చెప్పాడు.
ప్రొజెక్టర్‌పై లైంగిక కంటెంట్ ఉన్న వీడియోలు!
ప్రొఫెసర్‌పై వచ్చిన ఆరోపణల్లో విద్యార్థులను ఎక్కువగా ఇబ్బందికి గురిచేసిన అంశం క్లాస్‌రూమ్‌లో వీడియోలు ప్రదర్శించడమే. సాధారణంగా పాఠాలు చెప్పేటప్పుడు సినిమాలు, పాపులర్ కల్చర్‌కు సంబంధించిన ఉదాహరణలు చూపించడం జరుగుతుంటుంది. అయితే ఒకసారి సబ్జెక్ట్‌లో భాగమంటూ ప్రొజెక్టర్‌పై లైంగిక అంశాలతో కూడిన వీడియో క్లిప్స్ చూపించారని ఒక విద్యార్థి ఆరోపించాడు.
విజువల్స్ ద్వారా చెప్పే విషయాలు విద్యార్థుల మనసుల్లో బలంగా నాటుకుంటాయని ముందుగా చెప్పి, తాను మాటల్లో వివరించే అంశాలను ప్రొజెక్టర్‌పై చూడాలని ప్రొఫెసర్ సూచించారట. కానీ ఆ వీడియోల్లో లైంగిక కంటెంట్ ఎక్కువగా ఉండటంతో క్లాస్‌లో చాలామంది అసౌకర్యానికి గురయ్యారని విద్యార్థి వెల్లడించాడు.
తాను అబ్బాయినైనా ఆ వీడియోలు చూసి ఇబ్బందిగా అనిపించిందని, అలాంటప్పుడు అమ్మాయిల పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చని చెప్పాడు. కొందరు విద్యార్థులు నవ్వడం, మరికొందరు హూటింగ్ చేయడం కూడా జరిగిందని వివరించాడు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో పరిశీలించిన అంశాల్లో ఒకటి.
వాట్సాప్ గ్రూపులో ఒక్క మెసేజ్‌తో బయటపడిన వ్యవహారం!
ప్రొఫెసర్ ప్రవర్తనపై విద్యార్థుల్లో గతంలోనూ చర్చలు జరిగేవని తెలుస్తోంది. 2025లో కూడా రెండు మూడు సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు వినిపించినప్పటికీ, అవి విద్యార్థుల మధ్య చర్చలకే పరిమితమయ్యాయని ఒక విద్యార్థి తెలిపాడు. సీనియర్లు కూడా గతంలో ప్రొఫెసర్ గురించి కొన్ని విషయాలు చెప్పేవారని, అయినప్పటికీ ఎవరూ బహిరంగంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని పేర్కొన్నాడు.
2026 మేలో ఒక విద్యార్థిని తనకు ఎదురైన అనుభవాన్ని అనధికారిక వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో పరిస్థితి మారింది. వివా సమయంలో తన చేతిని తాకాలని అడగడంతో పాటు, ‘క్వికీ’ అనే పదానికి అర్థం ఏమిటని ప్రొఫెసర్ ప్రశ్నించారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మెసేజ్ తర్వాత మరికొంతమంది విద్యార్థినులు కూడా తమ అనుభవాలను బయటపెట్టారు. సుమారు 13 మంది విద్యార్థులు ఆమెకు మద్దతుగా స్పందించారు.
దీంతో మే 18న విద్యార్థులు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొదట తమలో తామే మాట్లాడుకున్న విషయాలు, ఇప్పుడు అధికారిక విచారణకు దారితీశాయి.
విద్యార్థినుల వ్యక్తిగత జీవితాలపై ఆరా.. కమిటీ నివేదికలో ఏముంది?
ఈ రిపోర్ట్ లో మొత్తం తొమ్మిది ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినుల డేటింగ్ చరిత్ర, బాయ్‌ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాల గురించి ప్రొఫెసర్ ప్రశ్నించేవారని ఫిర్యాదులు వచ్చాయి. వాలెంటైన్స్ డే రోజున ఏం చేశారని అడగడం, బాయ్‌ఫ్రెండ్‌తో ఏం చేస్తారని ప్రశ్నించడం వంటి అంశాలను కమిటీ పరిశీలించింది. ఈ ప్రశ్నలకు చదువుతో ఎలాంటి సంబంధం లేదని, విద్యార్థుల్లో భయం, అవమానం, అసౌకర్యం కలిగించేలా ఉన్నాయని కమిటీ అభిప్రాయపడింది.
మాజీ విద్యార్థినులతో వ్యక్తిగత సంబంధాల గురించి ప్రొఫెసర్ మాట్లాడేవారని కూడా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అలాగే కొంతమంది విద్యార్థులకు యూనివర్సిటీలో కాకుండా తన ఇంట్లోనే వివా నిర్వహించేవారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని వివాలు ఐదు నిమిషాల్లో ముగిస్తే, మరికొన్ని అరగంట నుంచి గంట వరకు కొనసాగేవట. ఒక విద్యార్థినికి రాత్రి 11.40 గంటల వరకు వివా నిర్వహించారన్న ఆరోపణ కూడా ఉంది.
కొన్ని సందర్భాల్లో వివా జరుగుతున్నప్పుడు అక్కడ మూడో వ్యక్తి కూడా ఉండేవారు కాదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన వృత్తిపరమైన హద్దులు దాటినట్లు కనిపిస్తోందని కమిటీ గుర్తించింది. విద్యార్థినుల చేతులు పట్టుకోవడం, శారీరకంగా తాకాలని కోరడం వంటి అంశాలకు సంబంధించిన ఆధారాలు కూడా విచారణలో లభించినట్లు నివేదిక పేర్కొంది.
రెండు నెలల పాటు ఎందుకు సాగదీసినట్లు?
ఈ వ్యవహారంలో ప్రొఫెసర్ ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలతో పాటు యూనివర్సిటీ విచారణ తీరుపైనా విమర్శలు మొదలయ్యాయి. మే నెలలోనే ఫిర్యాదులు అందినా, విచారణ ప్రారంభించడానికి దాదాపు రెండు నెలలు ఎందుకు పట్టిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒక ప్రొఫెసర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట సుమారు 18 మంది విద్యార్థులు ఈ వ్యవహారంపై ముందుకొచ్చారు. వారిలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఉన్నారు. తర్వాత ఇద్దరు ముగ్గురు విద్యార్థినులు వెనక్కి తగ్గడంతో చివరకు 15 మంది ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. సాధారణంగా ఇలాంటి విచారణ 90 రోజుల్లో పూర్తి కావాల్సి ఉండగా, మొదటి రెండు నెలలు కమిటీ పెద్దగా స్పందించలేదని ఆరోపించారు.
సెమిస్టర్ విరామం తర్వాత విద్యార్థులు తిరిగి వచ్చి కమిటీని ప్రశ్నించడంతో విచారణ ముందుకు కదిలిందని ఆయన చెప్పారు. విద్యార్థుల దగ్గర వాట్సాప్ చాట్స్, వీడియోలు వంటి ఆధారాలు ఉన్నాయని, సెప్టెంబర్‌లో చాట్స్ బయటకు వచ్చిన తర్వాతే కమిటీ నివేదిక విడుదల చేసిందని ఆరోపించారు. విచారణ నివేదికను విద్యార్థులకు ఎందుకు అందించలేదు? చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరిగింది? అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
‘నేను అందంగా ఉంటాను కాబట్టే టార్గెట్ చేస్తున్నారు!’
మరోవైపు ప్రొఫెసర్ బిమోల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తనపై కావాలనే దాడి చేస్తున్నారని, ఇదంతా ఒక ‘విచ్ హంట్’ అని అభివర్ణించారు. తాను అందంగా ఉంటాననే కారణంతోనే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విద్యార్థులతో అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మే 31నే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చానని ఆయన మీడియాకు తెలిపారు. అయినప్పటికీ తన వాదనలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండానే విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికను, తొలగింపు ఉత్తర్వులను కూడా తనకు సకాలంలో అందించలేదని చెప్పారు. విచారణలో తన వాదనలకు సరైన అవకాశం ఇవ్వలేదన్నది ఆయన ప్రధాన అభ్యంతరం.
మీడియా వారు ఆయనను సంప్రదించి వివరణ కోరినప్పటికీ స్పందన రాలేదు. JNU వైస్ ఛాన్సలర్‌ను కూడా సంప్రదించగా ఎలాంటి సమాధానం అందలేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







