మళ్లీ కెమెరా ముందుకు విజయ్!
సినిమాలకు స్వస్తి పలికి పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమవుతానని అనౌన్స్ చేసిన తమిళనాడు సీఎం విజయ్(Vijay) మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి ఆయన నటించబోయేది సినిమా కోసం కాదు.. తమిళనాడు ప్రభుత్వ ప్రచార ప్రకటన కోసం. ఆఖరి సినిమాగా జన నాయగన్(jana nayagan)ను అనౌన్స్ చేసిన విజయ్, తన సినీ ప్రయాణానికి ముగింపు పలికి తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎవరూ ఊహించని సక్సెస్తో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, 2026 మేలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పాలనా వ్యవహారాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ స్పెషల్ యాడ్ లో నటించేందుకు విజయ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన రెండు రోజుల టైమ్ ను కేటాయించినట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham vasudev menon) ఈ యాడ్ కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో ఈ ప్రమోషనల్ యాడ్ ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రెగ్యులర్ గవర్నమెంట్ యాడ్స్ కు భిన్నంగా ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారనే ప్రచారానికి ఈ పరిణామాన్ని ముడిపెట్టడం సరికాదు. ఆయన కెమెరా ముందుకు వస్తున్నది కేవలం ప్రభుత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగానేనని సమాచారం. రాజకీయ బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తూ, సినీ రంగానికి దూరంగానే కొనసాగనున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.







