చెవిరెడ్డి ఫ్యామిలీ బతిమాలితేనే వెనక్కి తగ్గాం..!
తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ముగిసినా, చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాలపై చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, కీలక నేత పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudha Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి కుమారుడు విజయం సాధించడం వెనుక తీవ్ర అవకతవకలు జరిగాయని, కేవలం మానవతా దృక్పథంతోనే తాము రీకౌంటింగ్ డిమాండ్‌ను వదులుకున్నామని ఆమె బాంబు పేల్చారు.
మీడియాతో మాట్లాడిన పులివర్తి సుధారెడ్డి కౌంటింగ్ రోజు రాత్రి జరిగిన హైడ్రామాను వివరించారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ రూమ్‌ను మార్చారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలోనే ఓట్ల లెక్కింపులో తీవ్ర అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ఫలితాల్లో కేవలం 600 ఓట్ల నామమాత్రపు తేడా మాత్రమే ఉందని, అదే సమయంలో 2 వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా తేలాయని సుధారెడ్డి గుర్తుచేశారు. ఇంత తక్కువ మెజారిటీ, భారీగా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నప్పుడు కచ్చితంగా రీకౌంటింగ్ కోరాలని తాము భావించామని, లీగల్‌గా పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధమయ్యామని ఆమె స్పష్టం చేశారు.
తాము రీకౌంటింగ్ కోరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తెరవెనుక ఊహించని పరిణామం జరిగిందని సుధారెడ్డి వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ వద్దకు వచ్చి బతిమాలారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. “పెద్ద కొడుకు ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయాడు.. ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఓడిపోతే తట్టుకోలేడు, డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు.. దయచేసి పెద్ద మనసుతో వదిలేయండి” అని చెవిరెడ్డి కుటుంబ సభ్యులు తమను ప్రాధేయపడ్డారని సుధారెడ్డి పేర్కొన్నారు.
ఒక కుటుంబంగా వారి పరిస్థితిని చూసి, కేవలం మానవతా దృక్పథంతోనే తాము రీకౌంటింగ్ అడగకుండా వెనక్కి తగ్గామని, కానీ అలా చేసి పెద్ద తప్పు చేశామని సుధారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము చూపించిన హుందాతనాన్ని, పెద్దరికాన్ని అవతలి పక్షం కనీసం గౌరవించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిర్ణయాన్ని వారు తక్కువ చేసి మాట్లాడుతున్నారని, తమ హుందాతనానికి, వారి దిగజారుడు రాజకీయాలకు ఎక్కడా పోలికే లేదని సుధారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జెడ్పీటీసీ కౌంటింగ్‌లో అక్రమాలు చేసి గెలిచినా.. నైతికంగా చెవిరెడ్డి కుటుంబం ఓడిపోయిందనే అర్థం వచ్చేలా సుధారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జోరుగా వైరల్ అవుతున్నాయి.







