2028 అధ్యక్ష రేసులో రో ఖన్నా, మార్కో రూబియో, జేడీ వాన్స్ పేర్లు తెరపైకి!
వాషింగ్టన్: అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఘట్టం ముగియడంతో అందరి దృష్టి 2028లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోరుపైకి మళ్లింది. అధ్యక్ష పీఠం కోసం భవిష్యత్తులో జరిగే పోరులో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే దానిపై రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రముఖ భారతీయ అమెరికన్ నేత, కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రో ఖన్నా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటివరకు ఐదుసార్లు కాంగ్రెస్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన కోసం, కాంగ్రెస్ మాజీ సభ్యుడు జమాల్ బౌమన్, వ్యూహకర్త నోమి కౌన్స్ట్ ‘రన్ రో’ పేరిట ప్రత్యేక గ్రూపును కూడా ప్రారంభించారు. అధ్యక్ష ఎన్నికల్లో రో ఖన్నా అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడం, దాతల నుంచి విరాళాలు సేకరించడమే ఈ గ్రూప్ ప్రధాన లక్ష్యంగా ఉంది. అయితే తాను బరిలో నిలిచే విషయంపై ఇంకా అధికారిక స్పష్టత ఇవ్వలేదని, కుటుంబ సభ్యులతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తానని ఆయన ఓ వార్తాసంస్థతో వెల్లడించారు.
మరోవైపు రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా అధ్యక్ష రేసుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్న రిపబ్లికన్ నేత మార్కో రూబియో కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడే అవకాశం ఉందంటూ కొన్ని వార్తాసంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఇందుకోసం ఆయన త్వరలోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రైమరీ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ప్రభుత్వంలోనే కొనసాగుతానని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.







