ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పీడ్ పెంచిన బీఆర్ఎస్!
తెలంగాణలో మరో కీలక సమరానికి తెరలేచింది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, క్షేత్రస్థాయిలో తన పట్టును నిలుపుకోవడానికి పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా మేధావి వర్గంతో పాటు పట్టభద్రులను తమ వైపునకు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ కేడర్ పెద్ద కసరత్తే చేస్తోంది.
పట్టభద్రుల నియోజకవర్గాలైన వరంగల్- నల్గొండ- ఖమ్మం అలాగే మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానాలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో గెలుపును కేవలం సాధారణ విజయంగా కాకుండా, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యావంతులలో వస్తున్న వ్యతిరేకతను అంచనా వేసే గీటురాయిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తీసుకురావాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానం నుంచి కాసాని వీరేశ్ ముదిరాజ్, అలాగే వరంగల్- నల్గొండ- ఖమ్మం స్థానం నుంచి రాకేష్ రెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటీకే వీరు క్షేత్రస్థాయిలో ప్రచారం చురుగ్గా చేసుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే కేవలం అభ్యర్థుల ప్రకటన సరిపోదని గ్రహించిన బీఆర్ఎస్ అధినాయకత్వం, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్‌చార్జ్‌లను, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో నివాస ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో నల్గొండ ప్రాంతానికి చెందిన ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడు సుమారు 10,500 మంది ఓటర్లను నమోదు చేయగా, ఈసారి ఆ లక్ష్యాన్ని అధిగమించి 13,000 నుంచి 14,000 మంది పట్టభద్రులను నమోదు చేయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతీ పట్టభద్రుడు తమ ఓటును కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియే ఇప్పుడు పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. దీన్ని అవకాశంగా మలుచుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు, గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కేవలం సాధారణ స్థానిక పోరుగా కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో తమ ఉనికిని, సత్తాను మరోసారి చాటిచెప్పే వేదికగా బీఆర్ఎస్ మలుచుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకుని బూత్ స్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా సాగుతున్న ఈ ప్రచారం గులాబీ పార్టీకి ఎంతవరకు ఫలితాలను ఇస్తుందనేది కాలమే నిర్ణయించాలి.







