డీప్‌ఫేక్ బారిన ఎంఐఎం ఎమ్మెల్సీ!?
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. అదే స్థాయిలో నేరస్థులు దానిని దుర్వినియోగం చేస్తున్న తీరు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రాజకీయ నాయకులను, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ నేరాల ముఠా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఎంఐఎంకి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను లక్ష్యంగా చేసుకుంది సైబర్ ముఠా. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను డీప్‌ఫేక్, మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా అసభ్యకరంగా సృష్టించి రూ. 5 కోట్లు డిమాండ్ చేసింది. ఈ కుట్రను నార్సింగి పోలీసులు భగ్నం చేశారు.
ఇది కేవలం ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసే సాధారణ నేరంగా చూడలేం. టెక్నాలజీ ఎంతటి వినాశకరమైన ముప్పుగా మారుతుందో చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక. సులభంగా కోట్లు సంపాదించాలనే దురాశతో మొత్తం 14 మందితో కూడిన ఓ ముఠా ఈ దారుణానికి తెరతీసింది. నిందితులు మొదట రహమత్ బేగ్‌కు చెందిన కొన్ని చిన్న ప్రైవేట్ క్లిప్‌లను సేకరించి, వాటిని డీప్‌ఫేక్ సహాయంతో అత్యంత అభ్యంతరకరంగా మార్చారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తొలుత రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన ఈ ముఠా ఆ తర్వాత.. రూ. 5 లక్షలకు బేరం కుదుర్చుకుంది.
ఈ ఘటనకు సంబంధించి గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బేరం ప్రకారం దుస్తుల పెట్టెలో అమర్చిన రూ. 4 లక్షల నగదును ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి తీసుకుంటున్న సమయంలో నార్సింగి పోలీసులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోని బృందం చాకచక్యంగా వలపన్ని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత మరో ఇద్దరితో కలిపి మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 4.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ మొహసిన్ ఖాన్, ఫాతిమా బేగం అలియాస్ రీమా, మహ్మద్ సమీర్, మహ్మద్ జమీర్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ రెహాన్ తదితరులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ మొత్తం నెట్‌వర్క్‌లో 14 మంది సభ్యులు ఉండగా, మరో 8 మంది పరారీలో ఉన్నట్లు తేలింది.
ఈ ఉదంతానికి రాజకీయ నేపథ్యం కూడా తోడవ్వడం గమనార్హం. గతంలో ఓ యువతిపై లైంగిక దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ఆయన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలనే వివాదాలు నడిచాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలు, వీడియోలు పూర్తిగా ఏఐ జనరేటెడ్, కల్పితమని బేగ్ మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే తరహా మార్ఫింగ్ వీడియోలతో కొందరు వ్యక్తులు ఆయనను బ్లాక్‌మెయిల్‌కు గురిచేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్ర వెనుక రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయం ఉందా? లేక కేవలం ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను పట్టుకుంటే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.







