కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ సర్వేకు రంగం సిద్ధం!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎర్రవల్లి ఫాంహౌస్ చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల అంశంపై రెవెన్యూ యంత్రాంగం ఉచ్చు బిగిస్తోంది. ఫాంహౌస్ విస్తీర్ణం, దాని చుట్టూ ఉన్న సరిహద్దుల నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారులు సర్వేకు సన్నద్ధమవుతున్నారు.
ఎర్రవల్లి ఫాంహౌస్‌లోకి కొన్ని ప్రభుత్వ భూములతో పాటు, ఎస్సీ, బీసీలకు చెందిన నిరుపేద రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు కూడా కలిశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు ఆదేశించారు. సర్వే నెంబర్ 325 పరిధిలో ఉన్న ఈ భూములను గతంలో నిబంధనలకు విరుద్ధంగా ధరణి రికార్డుల్లో మార్పులు చేసి ఫాంహౌస్ విస్తరణకు, రహదారుల నిర్మాణానికి ఉపయోగించుకున్నారనేది ప్రధాన అభియోగం. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటో తేల్చేందుకు రెవిన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది.
సాధారణ తనిఖీలతో కాకుండా, ఈసారి సాంకేతికతను జోడించి లోతైన దర్యాప్తునకు రెవెన్యూ శాఖ, ప్రత్యేక విచారణ కమిటీ సిద్ధమయ్యాయి. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్ లను, దశాబ్దాల క్రితం నాటి పాత పహాణీ రికార్డులను, ప్రస్తుత రెవెన్యూ డాక్యుమెంట్లను బేరీజు వేయనున్నారు. ఫాంహౌస్ నిర్మిత ప్రాంతం ఎంత? చుట్టుపక్కల ప్రభుత్వ లేదా రైతుల భూములు ఏమైనా అన్యాక్రాంతమయ్యాయా అనే కోణంలో ఈ సర్వే జరగనుంది.
ఈ సర్వేలో భాగంగా మొదట ఎర్రవల్లి గ్రామ రైతులకు నోటీసులు జారీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా, ఫాంహౌస్ యజమాని హోదాలో కేసీఆర్‌కు కూడా ఎప్పుడైనా నోటీసులు అందించి, ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరే అవకాశాలున్నాయి. కేసీఆర్ ఫాంహౌస్‌పై రెవెన్యూ శాఖాధికారులు నేరుగా దృష్టి పెట్టడం, సర్వే ద్వారా సరిహద్దులను నిర్ధారించాలని భావిస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వే నివేదిక రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.







