వడివడిగా అమెరికా-ఇరాన్ చర్చలు..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓవైపు యుద్ధం చేసి సర్వనాశనం చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తుండగా.. మరోవైపు..పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా అమెరికా, ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. ఖతార్ మధ్యవర్తిగా రెండు దేశాల మధ్య తెరవెనక యత్నాలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతల్ని సడలించే దౌత్య ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఖతార్ పాలకుడు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్‌చేసి చర్చించారు. విభేదాల్ని పరిష్కరించి, ఘర్షణలకు తెరదించే సమగ్ర ఒప్పందం కుదిరేందుకు ఏం చేయాలనే సమాలోచనలు జరిపారు. తమ అణు కార్యక్రమంపై ఖతార్ ద్వారా అందిన ప్రతిపాదనల్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇంతవరకు పరోక్ష చర్చలకే సుముఖంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు అధికారిక చర్చలకు సంసిద్ధత వ్యక్తపరుస్తోంది. అణ్వాయుధాల్లో వాడేందుకు సరిపడే స్థాయిలో.. అత్యంత శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పూర్తిగా వదిలేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలోనే అంతర్జాతీయ పర్యవేక్షకుల ఆధ్వర్యంలో దానిని నిర్వీర్యం చేయడానికి సిద్ధమే కానీ.. దేశం దాటించేది లేదని ఇరాన్ అంటోంది. దీనివల్ల నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు రెండు దేశాలూ కొంత దిగివస్తున్నాయి. ఈ వైఖరి వల్ల ఒప్పందం కుదిరితే అదో పెద్ద ముందడుగు అవుతుంది.
సమగ్ర ఒప్పందానికి ఏం చేయాలి..
అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు దూసుకుపోయేందుకు ఈ యుద్ధం ఒక ప్రధాన కారణమైన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌పై తాజా దాడులు జరిపే ప్రణాళికలేవీ లేవని ట్రంప్ చెప్పగానే చమురు ధరలు తగ్గడం ప్రారంభించాయి. ఇరాన్ తిరిగి పుంజుకోవడానికి కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని, సైనిక సామర్థ్యాన్ని ఆ దేశం మళ్లీ పెంచుకోకుండా ఉండేందుకు దాడులను ముమ్మరం చేయాలా? వద్దా? అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ విలేకరులకు చెప్పారు.
ప్రతిపాదనలు అంగీకరించాలంటున్న ఇరాన్..
ఇరాన్ కొత్త అణు ప్రతిపాదనను అగ్రరాజ్యానికి పంపింది. శాంతి చర్చలు కొనసాగాలంటే తమ ఏడు డిమాండ్లను అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పింది. తమ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధాన్ని, ఆంక్షలను ఎత్తివేయడం; స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, యుద్ధ నష్టాలకు పరిహారం, లెబనాన్ వంటి ఇతర ప్రాంతాలలో ఘర్షణలను పూర్తిగా ముగించడం, ఇరాన్ భూభాగాలపై దాడులు నిలిపివేయడం వంటివి అందులో ఉన్నాయి. అమెరికా తమపై దాడులు చేస్తే భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా తమ దళాలు దాడులు చేస్తాయని ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. చర్చలకైనా, యుద్ధానికైనా సిద్ధమేనని, తేల్చుకోవాల్సింది అమెరికాయేనని చెప్పారు.
యుద్ధం మళ్లీ రాజుకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికీ చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు తమ సర్వోన్నత నేత నుంచి కొత్తగా అధికారాలు లభించాయని తెలిపారు.







