ధరణి అక్రమాలపై సీఐడీ మెరుపు దాడులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి పోర్టల్ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ ఉక్కుపాదం మోపుతోంది. బీఆర్ఎస్ హయాంలో భూ రికార్డుల ప్రక్షాళన, పారదర్శకత లక్ష్యంగా తెచ్చిన ‘ధరణి’ పోర్టల్‌లో భారీ అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించంది. తాజాగా దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలు చేపట్టింది. సీఐడీ డీజీ చారుసిన్హా నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు ఏకంగా 15 ప్రత్యేక బృందాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ధరణి ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని భూ హక్కులను అక్రమంగా మార్పిడి చేసుకోవడం, భూదాన్ భూముల బైనంబర్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ ఆరా తీస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్లో లభించిన డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగానే ఈ సోదాలు కొనసాగిస్తోంది.
ఈ దర్యాప్తులో భాగంగా టెక్నాలజీ సేవలందించిన సంస్థలపై కూడా సీఐడీ దృష్టి సారించింది. గతంలో IL&FS Technologies Limitedగా ఉండి, ప్రస్తుతం TerraCIS Technologies Limited పేరుతో ప్రభుత్వ శాఖలకు ఈ-గవర్నెన్స్, భూ రికార్డుల డిజిటలైజేషన్, స్మార్ట్ సిటీ టెక్నాలజీ, ఐటీ సేవలు అందిస్తున్న సంస్థ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. పోర్టల్ రూపకల్పన, నిర్వహణలో అప్పట్లో టెక్నికల్ లోపాలను ఆసరాగా చేసుకుని ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారనే కోణంలో ఆ సంస్థల పాత్రను కూడా దర్యాప్తు చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటకు కట్టుబడి ధరణి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడంతో పాటు, గతంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సీఐడీ చేపట్టిన ఈ మెరుపు దాడులు, అరెస్టులు చూస్తుంటే ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బడా నాయకులు, అధికారుల పాత్ర త్వరలోనే బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.







