365 కేంద్రాల్లో కౌంటింగ్.. నేడు తేలనున్న అభ్యర్థుల రాజకీయ భవితవ్యం..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ZPTC), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC) ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ,నవంబర్ 7, ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విజేతలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొంది.
ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు, 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. నవంబర్ 5న ప్రధాన పోలింగ్ జరగగా, కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలు, తుఫాన్ ప్రభావం కారణంగా వాయిదా పడిన స్థానాల్లో నవంబర్ 6న పోలింగ్, రీపోలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70.72 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 2021లో నమోదైన 60.91 శాతం పోలింగ్‌తో పోలిస్తే ఈసారి ఓటర్ల భాగస్వామ్యం పెరిగింది.
ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,062 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్ వద్ద లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు. సుమారు 11 వేల మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 28 వేల మందికి పైగా సహాయకులు విధుల్లో పాల్గొంటున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు టేబుళ్లను కేటాయించి, రెండు ప్రక్రియలు సమాంతరంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
కౌంటింగ్‌లో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను పరిశీలించి రౌండ్ల వారీగా లెక్కింపు చేపడతారు. ప్రతి రౌండ్లో వచ్చిన ఆధిక్యాన్ని బట్టి అభ్యర్థుల విజయావకాశాలపై స్పష్టత రానుంది. తుది లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఫలితాల ప్రకటనకు సమయం పట్టే అవకాశం ఉంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 19,885 మంది పోలీసులతో మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, పోలీసుల బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నాయకత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ఈ పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఫలితాలు తమ క్షేత్రస్థాయి బలాన్ని అంచనా వేసుకునే అవకాశాన్ని కల్పించనున్నాయి. ముఖ్యంగా స్థానికంగా బలమైన నాయకులు, పార్టీ శ్రేణుల పనితీరు ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిందనేది ఫలితాలతో వెల్లడికానుంది. ఈరోజు సాయంత్రానికి మెజారిటీ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.







