వైసీపీ నుంచి బయటకు గెంటేశారు.. జగన్పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YCP) ఒకప్పుడు కీలక నాయకుడిగా, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇప్పుడు అదే పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు పార్టీ రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి తాను స్వచ్ఛందంగా బయటకు రాలేదని, తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారని ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన విజయసాయిరెడ్డి.. ఒక దశలో ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషించారు. కేంద్ర నాయకులతో సంబంధాలు కొనసాగించడం, పార్టీ వాదనలను జాతీయ స్థాయిలో వినిపించడం వంటి అంశాల్లో ఆయన చురుకుగా వ్యవహరించారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా సమాధానాలు ఇచ్చేవారు. అయితే కాలక్రమంలో పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందనే చర్చ మొదలైంది. చివరకు పార్టీకి దూరం కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
తాజాగా తన రాజకీయ ప్రయాణం, వైసీపీతో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడిన విజయసాయిరెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. పార్టీలో ఉన్న సమయంలో తనకు దాదాపు 70 సందర్భాల్లో అవమానాలు ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు. ఏ వ్యక్తికీ ఇలాంటి పరిస్థితులు రాకూడదని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy), వైఎస్ రాజారెడ్డి నుంచి కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని, జగన్ నాయకత్వంలో మాత్రం ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు.
తనను నేరుగా పార్టీ నుంచి తొలగించకపోయినా, పొమ్మనలేక పొగ పెట్టినట్లు వ్యవహరించారని ఆయన విమర్శించారు. అడుగడుగునా అవమానాలకు గురిచేస్తూ, పార్టీలో కొనసాగలేని పరిస్థితిని కల్పించారని అన్నారు. తాను నమ్మిన పార్టీ కోసం పనిచేస్తే చివరకు కూర్చున్న కొమ్మనే నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం కంటే ఏ పదవీ ముఖ్యం కాదనే ఉద్దేశంతోనే వైసీపీని వీడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ నెల 11న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. తమ పార్టీ హిందుత్వ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ వేదికగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరికీ అవమానాలు జరగకుండా గౌరవప్రదమైన వాతావరణం కల్పిస్తానని హామీ ఇచ్చారు. రెండు కుటుంబాలు, రెండు పార్టీల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరగాలా? అని ప్రశ్నిస్తూ వాటికి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తీరుపైనా ఆయన విమర్శలు చేశారు. అధికారాన్ని ఉపయోగించి ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల తీర్పును తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరించారు. మొత్తంగా కొత్త పార్టీ ప్రకటనకు సమయం దగ్గరపడుతున్న వేళ విజయసాయిరెడ్డి నేరుగా జగన్ నాయకత్వంపైనే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన కొత్త రాజకీయ ప్రయాణం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







