జో బైడెన్ బాటలోనే ట్రంప్ కూడా…
కాస్త తక్కువ నష్టంతో బయటపడితే చాలు, ప్రజలు తమ పాలనను అద్భుతంగా ఆమోదించేశారని నాయకులు భ్రమపడుతుంటారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం, అంటే 2022 మధ్యంతర ఎన్నికల తర్వాత డెమోక్రాట్ జో బైడెన్ సరిగ్గా ఇదే భ్రమలో బతికారు. ఆ తప్పుకే రెండేళ్ల తర్వాత 2024లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో అధికారాన్ని ఊడగొట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 2026 మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, రిపబ్లికన్లు కూడా ట్రంప్ హయాంలో అదే మోసపూరితమైన భ్రమలో పడే ప్రమాదం ఉందని ‘ది ఎకనామిస్ట’ పత్రిక తన సంపాదకీయంలో ముందస్తుగా హెచ్చరిస్తోంది. నాడు ‘రెడ్ సునామీ’ రాలేదు.. బైడెన్ విమర్శలను పట్టించుకోలేదు! 2022 అక్టోబర్ నాటికి అమెరికాలో పరిస్థితులు డెమోక్రా ట్లకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. గ్యాలన్ పెట్రోల్ ధర నాలుగు డాలర్లకు చేరడం, గృహ రుణ వడ్డీ రేట్లు 7 శాతానికి ఎగబాకడంతో దేశం సరైన దారిలో వెళ్తోందని కేవలం 20 శాతం మందే నమ్మారు. టెక్సాస్ రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ అయితే డెమోక్రాట్లను ముంచెత్తేలా ‘రెడ్ సునామీ’ రాబోతోం దని ధీమా వ్యక్తం చేశారు. తీరా ఫలితాలు చూస్తే, రిపబ్లికన్లు హౌస్‌లో స్వల్ప మెజారిటీ సాధించినప్ప టికీ, డెమోక్రాట్లు సెనేట్ను కాపాడుకుని కేవలం 9 స్థానాల నష్టంతో బయటపడ్డారు. ఈ ఊరటతో బైడెన్ విలేకరుల సమావేశంలో మార్పుల గురించి అడిగితే ‘నేనేమీ మార్చను’ అని గట్టిగా చెప్పారు. తన పాలనకు ప్రజల ఆమోదం లభించిందని పొరబడిన బైడెన్, రెండోసారి పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఆ తాత్కాలిక ఊరట రెండేళ్లకే ఆవిరైపోయి, 2024లో ట్రంప్ గ్రాండ్ ఎంట్రీకి దారితీసింది.
డెమోక్రాట్లకు మళ్లీ కలిసొస్తున్న పవనాలు!
2026 మధ్యంతర ఎన్నికల వైపు చూస్తే, డెమోక్రాట్లకు కొన్ని అంశాలు స్పష్టంగా కలసివస్తు న్నాయి. గతంలో గర్భస్రావ హక్కులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు డెమోక్రాట్లలో కసిని పెంచగా, ఇప్పుడు ట్రంప్ పాలనపై ఉన్న వ్యతిరేకత వారికి ప్రధాన ఆయుధంగా మారింది. ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం, ప్రస్తుతం ఓటు వేయడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నవారిలో 59 శాతం మంది డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుండగా, రిపబ్లికన్లలో ఆ ఉత్సాహం కేవలం 35 శాతానికే పరిమితమైంది. అయితే, ఇక్కడ డెమోక్రాట్లకు సొంతంగా అద్భుతమైన విధానాలేవీ లేవు; క్విన్నిపియాక్ సర్వే ప్రకారం సొంత పార్టీ ఓటర్లలో కూడా కాంగ్రెస్ డెమోక్రాట్లపై 48 శాతమే సంతృప్తిగా ఉన్నారు. అంటే, ఇప్పుడు కనిపిస్తున్న మద్దతు డెమోక్రాట్ల గొప్పతనం వల్ల వచ్చింది కాదు, కేవలం ట్రంప్‌పై ఉన్న కోపం వల్ల వస్తున్నదే. ఈసారి ఎన్నికల్లో దాదాపు 44 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను వ్యతిరేకించడానికే ఓటేస్తున్నామని చెబుతుండగా, ఆయనకు మద్దతుగా వేస్తున్నామని చెప్పినవారు 19 శాతం మాత్రమే ఉన్నారు.
‘ది ఎకనామిస్ట’ అంచనా ప్రకారం డెమోక్రాట్లకు సెనేట్ను గెలుచుకునే అవకాశాలు 60 శాతం వరకు, ప్రతినిధుల సభను కైవసం చేసుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కుక్ పొలిటికల్ రిపోర్ట్ కూడా డెమోక్రాట్లు హౌస్‌లో 9 నుండి 19 స్థానాలు అదనంగా గెలుచుకోవచ్చని చెబుతోంది. టెక్సాస్, సౌత్ కరోలినా వంటి చోట్ల ప్రజల్లో ప్రజాదరణ ఉన్నవారి కంటే తన పట్ల తీవ్ర విధేయత చూపించే అభ్యర్థులకే ట్రంప్ ప్రాధాన్యమివ్వడం, ఆయన సొంత నిర్ణయాల వల్ల ప్రజామోదం తగ్గిపోవడం రిపబ్లికన్లకు పెద్ద దెబ్బగా మారేలా ఉంది. రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘోరంగా ఓడిపోయినా, లేదా అంచనా లను తట్టుకుని స్వల్ప నష్టంతో బయటపడినా.. దాన్ని తమ పాలనకు ప్రజలు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ అని ట్రంప్ భావిస్తే అది పెద్ద పొరపాటే అవుతుంది. నియమావళి ప్రకారం ట్రంప్ ఇకపై మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయలేరు, కానీ 2029లో రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో నిలవాలనుకునే తర్వాతి తరం నాయకులకు ఇది కీలకమైన ఘట్టం.
ఓటమి తీవ్రత తక్కువగా ఉన్నంత మాత్రాన ప్రజలు తమ విధానాలను మెచ్చినట్లు కాదని వారు గుర్తించాలి. ట్రంప్‌తో సంబంధాలను గౌరవప్రదం గానే ఉంచుకుంటూ, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన నీడ నుంచి బయటపడి కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టడమే రిపబ్లికన్లకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం.







